Share News

Godavari water: గోదావరికి క్లియరెన్స్‌లు చకచకా..

ABN , Publish Date - Aug 30 , 2025 | 09:05 AM

మల్లన్నసాగర్‌ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్‌ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు చకచకా మొదలయ్యాయి.

Godavari water: గోదావరికి క్లియరెన్స్‌లు చకచకా..

- ప్రభుత్వ శాఖల అనుమతులు

- వివిధ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చేందుకు సుముఖం

- ఫలిస్తున్న వాటర్‌బోర్డు చర్చలు

హైదరాబాద్‌ సిటీ: మల్లన్నసాగర్‌ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను(Godavari water) తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్‌ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు చకచకా మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌ మహా నగరం వరకు రెండు వరుసల్లో 3,500 సామర్థ్యం కలిగిన రెండు భారీ పైపులైన్లను ఏర్పాటు చేయడానికి పెద్దఎత్తున భూముల అవసరంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు అనుమతులివ్వాల్సి ఉన్నది.


ఇందుకోసం ఇప్పటికే వాటర్‌బోర్డు అధికారులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి మల్టీపర్పస్‌ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకం కావడంతో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చేస్తున్నాయి. పనులు ఆలస్యమవ్వడానికి ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నారు.


సాఫీగా సాగేలా చర్యలు

ఫ మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మ వరకు పైపులైన్ల నిర్మాణానికి భూమి అందుబాటులో ఉన్నది. ఇరిగేషన్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకొని పైపులైన్ల నిర్మాణానికి బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు.

- మెదక్‌ జిల్లాలోని ములుగు వద్ద, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఘన్‌పూర్‌ వద్ద దాదాపు వంద ఎకరాల ఫారెస్టు భూములు అవసరమున్నవి. భూ సేకరణ కోసం వాటర్‌బోర్డు అధికారులు ఫారెస్టు అధికారులతో సంప్రదింపులు జరిపారు. భూమికి భూమి పరిహారమిచ్చి స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుదిదశకు చేరింది.


city6.jpg

- ప్రాజెక్టు కోసం సిద్ధిపేట, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రభుత్వ భూమితో పాటు 20 ఎకరాల వరకు అసైన్డ్‌ భూములు, పది ఎకరాల వరకు ప్రైవేటు భూములు అవసరమున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఆయా జిల్లాల కలెక్టర్లతో వాటర్‌బోర్డు అధికారులు చర్చించారు.

- జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించడానికి ఓఆర్‌ఆర్‌ వెంట పైపులైన్లను నిర్మాణం చేయాల్సి ఉన్నది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ నాటిన మొక్కలను తొలగించాల్సి రావడంతో బోర్డు అధికారులు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు.


రూ.7,360 కోట్లతో..

నగర ప్రజల దాహార్తి తీర్చడం, మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవంతో పాటు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి మల్టీపర్పస్‌ ప్రాజెక్టును రూ.7,360 కోట్లతో వాటర్‌బోర్డు చేపడుతోంది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి పంపింగ్‌ ద్వారా రెండు వరుసల్లో ఉండే 3,600 డయా పైపులైన్ల నుంచి శామీర్‌పేట (26 కిలోమీటర్ల మేర) వద్ద గల ఘన్‌పూర్‌ వరకు నీటిని తీసుకొస్తారు.


అక్కడ శుద్ధి చేసిన నీటిని నగరానికి తరలించనుండగా, శుద్ధి చేయని నీటిని మరో పైపులైన్‌ ద్వారా ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు పైపులైన్ల నిర్మాణానికి ఫారెస్టు, ఇరిగేషన్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎండీఏ, పర్యావరణం ఇలా ఏడు ప్రభుత్వ శాఖల అనుమతులు సాధించాల్సి ఉన్నది. ఆయా శాఖలు కూడా వేగంగానే స్పందిస్తూ అనుమతులు ఇస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 09:05 AM