HMDA: ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ తప్పుకున్నట్లే..
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:59 AM
నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఫోకస్ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్‌ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
- లే అవుట్ల అభివృద్ధిపైనే ఫోకస్
- బాచుపల్లి, తుర్కయాంజల్‌లో విక్రయాల్లో విఫలం
- ఇకపై రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు
హైదరాబాద్ సిటీ: నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఫోకస్ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్‌ఎండీఏ(HMDA) విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బాచుపల్లి, బహదూర్‌పల్లి(Bachupalli, Bahadurpally) తదితర ప్రాంతాల్లోని ప్లాట్లు ఈ-వేలంలో అమ్ముడుపోలేదు. ఇటీవల కాలంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన విక్రయాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ సంస్థ ద్వారానే ఇకపై అమ్మకాలు జరపాలని నిర్ణయుంచినట్లు తెలిసింది.
గతంలో ఇలా..
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గతంలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లు, స్థలాల విక్రయం చేపడితే దేశ, విదేశాలకు చెందినవారు పోటీ పడి కొనుగోలు చేసేవారు. గత ప్రభుత్వంలో ప్లాట్ల ఈ-వేలం ద్వారానే హెచ్‌ఎండీఏ దాదాపు రూ.13వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది. డెవలపర్లకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు జారీ చేసే హెచ్‌ఎండీఏనే స్వయంగా రంగంలోకి దిగితే ఎలాంటి ఫలితాలుంటాయో చూపించింది. ఉప్పల్ భగాయత్, కోకాపేట నియోపోలీసు లేఅవుట్, బుద్వేల్, మోకిల, బహదూర్‌పల్లి, తొర్రూర్, మేడిపల్లి, బాచుపల్లి, తుర్కయాంజల్, షాబాద్, కుర్మల్‌గూడ తదితర ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేస్తోంది. అంతేకాకుండా ప్రజలు ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో ప్లాట్ల వేలంలో ఎస్టేట్ విభాగంతో పాటు ఇంజనీరింగ్, ప్లానింగ్ అన్ని విభాగాలూ భాగస్వామ్యమయ్యేవి.
ఇటీవలి కాలంలో విఫలం
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దసరా పండగకు ముందు బాచుపల్లి, తుర్కయంజాల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను వేలం వేశారు. తుర్కయంజాల్‌లో 12ప్లాట్లకు రెండు అమ్ముడుపోగా, బాచుపల్లిలో 70 ప్లాట్లకు ఒక్కటీ అమ్ముడుపోలేదు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 11 స్థలాలను అమ్మకానికి పెడితే పుప్పాలగూడలో కేవలం ఒక్క ప్లాట్ అమ్ముడుపోయింది. మూడు రోజుల ఈ-వేలంలో మొత్తంగా మూడే స్థలాలు అమ్ముడుపోయాయి.

ఈసారి ఇష్టానుసారంగా కనీస ధరలను నిర్ణయించడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం వేలంలో పాల్గొనే సాహసం చేయలేదు. కేవలం ఉన్నతవర్గాలే ఆసక్తి చూపేలా తుర్కయంజాల్‌లో చదరపు గజం కనీస ధర రూ.65 వేలు, బాచుపల్లిలో చదరపు గజం కనీస ధర రూ.70వేలు నిర్ణయించారు. ఈ-వేలం ప్రక్రియలో హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల అధికారుల భాగస్వామ్యం లేకుండా కేవలం ఎస్టేట్, పీఈఓయూ విభాగాలకే పరిమితం చేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు జరగలేదు. దీంతో హెచ్‌ఎండీఏ ప్రస్తుతం లేఅవుట్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు
తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలోని ప్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో కార్పొరేషన్‌కు చెందిన భూములను హెచ్‌ఎండీఏకు అప్పగించడంతో బహదూర్‌పల్లి, తొర్రూర్, మేడపల్లి, బాచుపల్లి, తుర్కయంజాల్, షాబాద్, కుర్మల్‌గూడ తదితర ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో లేఅవుట్ల డ్రాఫ్ట్‌ను ప్రకటించి అప్పటి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ద్వారా ప్లాట్లను ఆన్‌లైన్‌లో విక్రయించింది.
కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 16నెలల్లో లేఅవుట్లను అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. మూడేళ్లవుతున్నా లేఅవుట్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఆయా లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా ఈ నెల 28, 29 తేదీల్లో ఈ-వేలం వేయడానికి నోటిఫికేషన్ వేశారు. అన్ని వర్గాల ప్రజలకూ అవకాశం కల్పిస్తూ తొర్రూర్‌లో చదరపుగజం అప్‌సెట్ ధర రూ.25 వేలు, బహదూర్‌పల్లిలో రూ.27-30 వేలు, కుర్మల్‌గూడలో రూ.20వేలుగా నిర్ణయించారు. అప్‌సెట్ ధర తక్కువగా ఉండడంతో ప్రజల నుంచి ఆసక్తి అధికంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News