BJP Telangana president N. Ramchander Rao: జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:34 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు చెప్పారు. ఇక్కడి ఓటర్లు బీజేపీని గెలిపించకపోతే శాసనసభలో....
కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యమే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు చెప్పారు. ఇక్కడి ఓటర్లు బీజేపీని గెలిపించకపోతే శాసనసభలో మజ్లిస్ సభ్యుల సంఖ్య 8 అవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో మజ్లి్‌సను అడ్డుకోవాలంటే బీజేపీ విజయం తప్పనిసరి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని, కానీ జూబ్లీహిల్స్‌లో గెలిేస్త ఆ పార్టీ ‘ఆరు కొత్త గ్యారంటీలు’ కొత్త మేనిఫెస్టోలా అమలవుతాయని ఎద్దేవా చేశారు. ‘ఆ ఆరు గ్యారంటీలు ఏమిటంటే.. జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత - వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు - బెదిరింపులు, దౌర్జన్యాలపై కేసులు నమోదు చేయకపోవడం - వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు రూ.50,000 పింఛన్ - రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు - భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ’ అని రాంచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచార వ్యూహంపై కేంద్ర కిషన్‌రెడ్డితో కలిసి రాంచందర్‌రావు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్‌లలో శక్తి కేంద్రాల వారీగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ‘మొన్న హైదరాబాద్‌లో ఒక డీసీపీపై జరిగిన దాడి ఘటన విచారకరం. అయితే అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే.. పోలీసు అధికారులపై దాడి చేసిన వారిని ఎంఐఎం నాయకులు ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళ్లడం’ అని పేర్కొన్నారు. తెలంగాణాలో ఒకవైపు గన్ కల్చర్, హింస పెరుగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘బీఆర్‌ఎస్ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయింది. ‘కారు’ రాజకీయంగా పంక్చర్ అయిపోయింది. ఆ కారు ఇప్పుడు షెడ్‌లోనే ఉండిపోయింది. అలాంటి కారులో నుంచి బయటికి వచ్చిన వాళ్లు ఏం మాట్లాడినా, దానికి స్పందించాల్సిన అవసరమే లేదు’ అని విమర్శించారు.
బిహార్‌లో ఎన్డీయే కూటమిదే గెలుపు : లక్ష్మణ్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బీహార్ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొంటూ, కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ నినాదం బూమరాంగ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలోనూ మాట్లాడారు. మజ్లి్‌సను పెంచి పోషించడమే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల ఎజెండా అని ఆయన దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ముసుగులో మజ్లి్‌సను గెలిపించే ప్రయత్నం జరుగుతోందని లక్ష్మణ్ ఆరోపించారు. పోటీ కాంగ్రెస్- బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చొరబాటుదారులు, రోహింగ్యాలు పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. ‘బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. యూపీ లాంటి మార్పు తెలంగాణలో కూడా రావాలి’ అని లక్ష్మణ్ ఆకాంక్షించారు.