Orange Alert: నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:43 AM
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఆదివారం రాత్రి తుపానుగా మారింది. ఈ తుపానుకు మొంథా అనే పేరు పెట్టినట్లు హైదరాబాద్ వాతావరణ...
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావం
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
పంటల కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఆదివారం రాత్రి తుపానుగా మారింది. ఈ తుపానుకు మొంథా అనే పేరు పెట్టినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 28(మంగళవారం) ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య లో కాకినాడకు సమీపంలో ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో పంటల కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సీఎం ఆదేశాలతో సోమవారం సాయంత్రం జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జోన్ పరిధిలోని మొత్తం 92 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. వాటిలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈనెల 28, 29 తేదీ ల్లో రద్దయిన రైళ్లలో లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్(2) విశాఖ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-భువనేశ్వర్-హైదరాబాద్ స్పెషల్స్(2), హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ విజయవాడలోని డీఆర్‌ఎం కార్యాలయంలో తుపానుపై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.