Hyderabad: బాచుపల్లి జీరో.. వేలంలో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోలే
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:10 AM
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ ప్లాట్లు వేలం వేస్తోందంటే జనం భారీగా పోటీ పడతారు. స్థలాలు నిమిషాల్లోనే అమ్ముడై.. సంస్థకు రూ.కోట్లు సమకూరతాయి. కానీ ఈసారి అలా జరగలేదు.
- గజం రూ.70 వేలుగా నిర్ణయించిన హెచ్‌ఎండీఏ
- గతం కంటే భారీ ధర ఉండటంతో స్పందన కరువు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ(HMDA) ప్లాట్లు వేలం వేస్తోందంటే జనం భారీగా పోటీ పడతారు. స్థలాలు నిమిషాల్లోనే అమ్ముడై.. సంస్థకు రూ.కోట్లు సమకూరతాయి. కానీ ఈసారి అలా జరగలేదు. రెండున్నరేళ్ల తర్వాత బుధవారం తుర్కయంజాల్(Turkyanjal)లో ప్లాట్ల వేలం చేపట్టగా.. రెండే అమ్ముడుపోయాయి. గురువారం బాచుపల్లి లేఔట్(Bachupalli Layout)లో ప్లాట్ల వేలం జరగ్గా.. ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు.
గజం కనీస ధర రూ.70వేలుగా నిర్ణయించడం, సరైన ప్రచారం, అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. తుర్కయంజాల్‌లో లేఔట్‌లోని 12 ప్లాట్లకు బుధవారం వేలం వేస్తే కేవలం రెండే అమ్ముడుపోయాయి. అందులో ఒక ప్లాట్ గజం రూ.1.10 లక్షలు పలికింది. అమ్ముడుపోని ప్లాట్లలో అత్యధికంగా ప్లాట్ల సైజ్ సక్రమంగా లేకపోవడం, కనీస ధర గజానికి రూ.65వేలు నిర్ణయించడంతో స్పందన లేదు.

మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి లేఔట్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయగా.. రెండున్నరేళ్ల క్రితం వందకు పైగా ప్లాట్లను విక్రయించారు. గురువారం 70 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహిస్తే ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోలేదు. నివాసాల మధ్య ఉన్న లేఔట్‌లోని ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని హెచ్‌ఎండీఏ అధికారులు గజం కనీస ధరను రూ.70వేలు నిర్ణయిస్తే.. ఒక్కరూ కొనుగోలుకు ముందుకు రాలేదు.
ఇష్టానుసారంగా కనీస ధరల నిర్ణయం
బాచుపల్లిలో లేఔట్‌ను ప్రకటించిన తర్వాత మూడు విడతలుగా దాదాపు 180 ప్లాట్ల వరకు విక్రయించారు. అప్పట్లో గజం కనీస ధర రూ.25 వేలు మాత్రమే. దాంతో జనం పోటీపడి కొనుగోలు చేశారు. మూడు విడతల్లో బాచుపల్లిలో ప్లాట్లను విక్రయిస్తే అత్యధికంగా గజం రూ.68వేలు, సగటున రూ.59,149 పలికింది. అప్పట్లో పలికిన గజం అత్యధిక ధరను ఆధారంగా చేసుకొని ఇప్పుడు కనీస ధరను నిర్ణయించడం గమనార్హం. తుర్కయంజాల్‌లో గతంలో గజం కనీస ధర రూ.25వేలు మాత్రమే.. ప్రస్తుతం రూ.65వేలు నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News