Share News

Shashikala Case ED Raids: శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:29 AM

కెనరా బ్యాంకును రూ.200 కోట్ల మేర మోసగించిన కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సహచరి అయిన వీకే శశికళ బినామీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది...

Shashikala Case ED Raids: శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌, చెన్నై, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కెనరా బ్యాంకును రూ.200 కోట్ల మేర మోసగించిన కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సహచరి అయిన వీకే శశికళ బినామీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది. 2022లో సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. చెన్నై, హైదరాబాద్‌ల్లో గురువారం సోదాలు నిర్వహించింది. శశికళకు బినామీ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గ్‌ గ్రూపు అధినేత జి.రామకృష్ణారెడ్డి(జీఆర్‌కే రెడ్డి) లక్ష్యంగా ఈడీ బృందాలు గురువారం దాడులు చేశాయి. హైదరాబాద్‌లోని శామీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో జీఆర్‌కే రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. చెన్నైలోని సైదాపేట శ్రీనగర్‌ ప్రాంతంలోని రామకృష్ణారెడ్డి ఇంట్లో, తిరువాన్మియూరు, కోడంబాక్కం, వెస్ట్‌ మాంబళం సహా ఆరు ప్రాంతాల్లో కూడా ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలు, జీఆర్‌కే రెడ్డి, ఆయన సంస్థలు కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మిడ్‌వెస్ట్‌ గోల్డ్‌, మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో జీఆర్‌కే రెడ్డికి రూ.2,800 కోట్లకు పైగా విలువైన షేర్లు ఉన్న నేపఽథ్యంలో ఆ వివరాలను కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. శశికళ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఆ డబ్బును జీఆర్‌కే రెడ్డికి చెందిన సంస్ధలకు మళ్లించగా.. ఆ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలో పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేపట్టిన జీఆర్‌కే రెడ్డి.. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె తరఫున హైదరాబాద్‌లో ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ తరఫున జీఆర్‌కే రెడ్డి పని చేస్తున్నారనే సమాచారంతోనే ఈడీ ఆయనపై దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:29 AM