Share News

Weather Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు!

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:07 AM

ష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రెండు రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, యెల్లో అలెర్ట్‌లను జారీ చేసింది.

Weather Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు!

పలు జిల్లాలకు ఆరెంజ్‌, యెల్లో అలెర్ట్‌ల జారీ.. ఈ నెల్లో ఇప్పటివరకు 16.7 సెం.మీ. వర్షపాతం

  • కృష్ణాలో భారీగా.. గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద

  • 2 వేల మిలియన్‌ యూనిట్లు దాటిన జలవిద్యుదుత్పత్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రెండు రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, యెల్లో అలెర్ట్‌లను జారీ చేసింది. శనివారం అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని.. ముఖ్యంగా ఆదిలాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్‌, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఇటు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా 167 మిల్లీమీటర్ల (16.7 సెం.మీ.) వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ 15 రోజుల సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే.. అంటే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది. అలాగే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఆగస్టు 15 వరకు సాధారణ వర్షపాతం 464 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 509 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద..

కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంటే.. గోదావరి ప్రాజెక్టులకు మాత్రం స్వల్పంగానే వస్తోంది. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు శుక్రవారం 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 1.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. నాగార్జునసాగర్‌కు 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... అంతే స్థాయిలో ఔట్‌ఫ్లో ఉంది. సాగర్‌ 14 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు 1.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.67 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 15,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... 19 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాలకు 1.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఔట్‌ఫ్లో 68 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఔట్‌ఫ్లో 4,733 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఔట్‌ ఫ్లో 10,578 క్యూసెక్కులుగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా.. 28,857 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు నిర్మల్‌ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. మధ్యాహ్నం వరకే ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల వరద చేరింది. దీంతో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావ్‌ పటేల్‌ చేతుల మీదుగా పూజలు నిర్వహించి.. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కులను విడిచిపెట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో భారీగా పర్యాటకులు వచ్చి వీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద శుక్రవారం రాత్రి నాటికి జలవిద్యుదుత్పాదన 2 వేల మిలియన్‌ యూనిట్లు దాటింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 04:07 AM