Hyderabad Rain: హైదరాబాద్‌పై వరుణ గర్జన
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:07 AM
కురిసేదాకా తెలియనే లేదు.. వరద పోటుతో బెంబేలెత్తించే భారీ వర్షం అని! ఉదయం నుంచి ఎండ దంచికొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
గంటన్నరపాటు దంచికొట్టిన వాన
చెరువులను తలపించిన రహదారులు
మునిగిన కార్లు.. కొట్టుకుపోయిన బైక్‌లు
రోడ్ల మీద 4-5 కి.మీ. మేర ట్రాఫిక్ జాం
కాలనీలు జలమయం.. ఇళ్లలోకి వరద
ఖాజాగూడలో 13.3 సెం.మీ.,
గచ్చిబౌలిలో 12.6 సెం.మీ. వర్షపాతం
నగరంలో అనేకచోట్ల 10 సెం.మీ. పైనే..
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి
బయటకు రావొద్దు: ముఖ్యమంత్రి రేవంత్
యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 14.8 సెం.మీ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కురిసేదాకా తెలియనే లేదు.. వరద పోటుతో బెంబేలెత్తించే భారీ వర్షం అని! ఉదయం నుంచి ఎండ దంచికొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. కొద్దిసేపటికే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా గంటన్నరపాటు కుండపోతగా వర్షం దంచికొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలుచోట్ల ఇలా వరుణుడు కంగారెత్తించాడు. ప్రత్యేకించి నాలుగు రోజుల క్రితమే భారీ వర్షంతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి గర్జించాడు. దీంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం 6:30 నుంచి 8 గంటలవరకు వర్షం పడింది. క్షణాల్లోనే వరద పోటెత్తింది. రోడ్లు చెరువులను తలపించాయి. కార్ల అద్దాల వరకూ నీళ్లొచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవొచ్చు. ప్రవాహ తీవ్రతకు రోడ్డు పక్కన, ఇళ్ల వద్ద పార్క్ చేసిన బైక్‌లు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్తీల్లో బియ్యం, పప్పులు తదితర నిత్యావసరాలు తడిసిముద్దవడంతో బడుగుజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, మదురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితరచోట్ల భారీ వర్షం పడింది. ఆరాంఘర్, సూరారం మల్లారెడ్డి కాలేజీ, లింగపల్లి రైల్వే ్డఅండర్‌బ్రిడ్జి, బండ్లగూడ రత్నదీప్ సూపర్‌మార్కెట్, గంగారం, చందానగర్ ప్రాంతాల్లో 4-5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు వైర్లు తెగిపడటంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో 43 ఫీడర్ల పరిధిలో విద్యుత్తు సరఫరా సమస్యలు ఏర్పడ్డాయి. లంగర్‌హౌస్, ప్రశాంత్‌నగర్, వినాయక్‌నగర్, రామంతాపూర్‌లోని శ్రీనివాసకాలనీ, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 వెంగళరావు భవనం వద్ద విద్యుత్తు స్తంభం పడిపోయింది. శేరిలింగంపల్లి ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో రాత్రి 11 గంటల వరకు 13.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 12.6 సెం.మీ, శ్రీనగర్ కాలనీలో 11.13, సరూర్‌నగర్‌లో 11.3, మణికొండలో 10.9, ఖైరతాబాద్‌లో 10.4, ఎల్బీనగర్‌లో 9.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 14.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అడ్డగూడూరులో 12.1, వలిగొండలో 10.4, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో 13.6, సూర్యాపేట జిల్లా నడిగూడెం 9.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.
కాగా వర్షాలు, వరదల కారణంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలపై దృష్టిసారించి.. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కాగా ఆకస్మిక వర్షాలు, వరదలపై జీహెచ్‌ఎంసీ పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో కొన్నిచోట్ల 12 సెం.మీ వర్షపాతం నమోదైందని చెబుతూ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని చెప్పారు. డ్రైనేజీ మూతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా వర్షాలు, వరదల కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు 250 బృందాలు పనిచేస్తున్నాయని సీఎ్‌సకు అధికారులు వివరించారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి 250 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 149 సమస్యలను వెంటనే పరిష్కరించినట్లు చెప్పారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అదేశించారు. జీహెచ్‌ఎంసీతోపాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు