Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు భారీ వర్షాలు..
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:11 AM
ఇప్పటికే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన జారీ చేయడంతో నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ(మంగళవారం) వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
ఉలిక్కి పడుతున్న నగరవాసులు...
ఇప్పటికే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన జారీ చేయడంతో నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు. అయితే.. నగరంలో ఇప్పటికే భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు మరోసారి హెచ్చరిక జారీ కావడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే నగరంలో ఆదివారం కురిసిన వర్షాలకు నాలాలు ఉప్పొంగడంతో ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫ్‌నగర్‌లో ఇద్దరు, ముషీరాబాద్‌లో ఒకరు గల్లంతయ్యారు. అఫ్జల్‌సాగర్ నాలాలో మామా, అల్లుడు కొట్టుకుపోగా... వినోదనగర్‌లో నాలాలో సన్నీ అనే యువకుడు కొట్టుకుపోయాడు. గచ్చిబౌలిలో గోడ కూలి మరొకరు మృతి చెందారు. ఇలా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం నలుగురిని బలితీసుకోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు నగరవాసులను కంగారు పెడుతున్నాయి. ఈ మేరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) మరోసారి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో అక్కడకక్కడ భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పింది. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. కాగా, ఈ నెల 20 లేదా 21 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ...
తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం