Share News

Harish Rao: బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు.. కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తా

ABN , Publish Date - May 14 , 2025 | 02:45 AM

బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

 Harish Rao: బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు.. కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తా

  • కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడతా.. పార్టీలో విభేదాల్లేవు:హరీశ్‌రావు

  • సోషల్‌ మీడియాలో నాపై దుష్ప్రచారం

  • పాకిస్థాన్‌ను కూడా నమ్మి అప్పులిస్తున్నారు

  • రేవంత్‌రెడ్డిని మాత్రం ఎవరూ నమ్మడం లేదు

  • అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు:హరీశ్‌రావు

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా సోషల్‌ మీడియా ద్వారా కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే.. స్వాగతించి సహకరిస్తానని చెప్పారు. తమ అధినేత కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. శిరసావహిస్తానని, తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఇప్పటికే ఖండించానని, సోషల్‌ మీడియా దుష్ప్రచారాలపై స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను పార్టీ మారతాననే చిల్లర ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షంపై బురద చల్లబోయి తానే గోతిలో పడ్డారని ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని, ఎవరూ నమ్మి అప్పు ఇవ్వడంలేదని రేవంత్‌రెడ్డి అంటున్నారు. చివరికి పాకిస్థాన్‌ను కూడా నమ్మి అప్పులిస్తున్నారు కానీ, రేవంత్‌రెడ్డిని మాత్రం ఎవరూ నమ్మడంలేదు’’ అని అన్నారు.


రైతాంగం యుద్ధం చేస్తోంది..

ఓవైపు మన సైన్యం దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే.. కాంగ్రెస్‌ అసమర్థ పాలన కారణంగా తెలంగాణలోని రైతాంగం తమ పంట అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం ఇవేమీ పట్టడంలేదని, ఆయన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, జూబ్లీహిల్స్‌ ప్యాలె్‌సలలో ప్రపంచ సుందరి అందాల పోటీలపై సమీక్షలతో బిజీగా ఉన్నారని విమర్శించారు. ధాన్యపు రాశుల చుట్టూ తిరగాల్సిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం మిస్‌ వరల్డ్‌ పోటీలంటూ.. అందాల రాశుల చుట్టూ తిరుగుతోందని తప్పుబట్టారు. రైతుల కష్టం తీర్చడానికి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామన్న ప్రభుత్వం.. 40 లక్షల మెట్రిక్‌ టన్నులు కూడా కొనలేదని, కొన్న వడ్లకు రూ.4 వేల కోట్లు బకాయి పడిందని ఆరోపించారు. కొన్న పంటకు రైతుల ఖాతాల్లో పది రోజులైనా డబ్బులు వేయలేదన్నారు. గత కొద్ది నెలలుగా సీఎం సచివాలయం ముఖం చూడటంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడపడమంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసినంత సులువుకాదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి రైతుల కష్టాలను తీర్చాలని హితవు పలికారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమపై విమర్శలకు దిగి రైతుల సమస్యలను పక్కదారి పట్టించడం తగదన్నారు. తడిసిన ప్రతి గింజనూ కొని.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, వారి ప్రాణాలు పోకుండా కాపాడాలని కోరారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల మరణాలు...

10 కిలోల తరుగు తీస్తున్నారంటూ ములుగు జిల్లా గోవిందరావుపేటలో జెట్టి రాజు అనే రైతు ఆత్మహత్యా యత్నం చేశాడని హరీశ్‌ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం కంటే మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ నష్టం కలిగిస్తున్నా.. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ఆన్‌లైన్‌ ట్రక్‌షీట్‌ విధానం అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక రైతులు రోజుల తరబడి ఎండలో ఉంటూ పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా పోచంపల్లిలో గగులోతు కిషన్‌, తొర్రూరు చెర్లపాలెంలో హనుమాండ్ల ప్రేమలత, మదనతుర్తిలో బిర్రు వెంకన్న, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో జలపతిరెడ్డి, సిద్దిపేట జిల్లా ఆకునూరులో చింతకింది హనుమయ్య అనే రైతులు మృతి చెందారని వివరించారు. సర్కారు నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని, ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వీటికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. రైతు సమస్యలపై పోరాడేందుకు బీఆర్‌ఎస్‌ త్వరలో కార్యాచరణ ప్రకటించనుందని చెప్పారు.

Updated Date - May 14 , 2025 | 02:46 AM