Share News

Harish Rao: ప్రజలకు కష్టాలు.. ప్రశ్నిస్తే కేసులు

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:39 AM

అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Harish Rao: ప్రజలకు కష్టాలు.. ప్రశ్నిస్తే కేసులు

  • కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిందేమీ లేదు: హరీశ్‌ రావు

నర్సాపూర్‌/మెదక్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతున్నా.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. కమీషన్లు దండుకోవడం, గత ప్రభుత్వంపై కమిషన్లు వేయడం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో పనులు చేశామని, రేవంత్‌ సర్కార్‌ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ కేసీఆర్‌ను తిట్టడం మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారని, ఈ విషయంపై రేవంత్‌ రెడ్డి ఆలోచించుకోవాలని అన్నారు.


రైతు మహాధర్నా నుంచి మధ్యలోనే వెళ్లిన హరీశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఇందులో హరీశ్‌ రావుతో పాటు మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డితో రాష్ట్ర బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్‌ బీసీ అంటూ రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు మౌనంగానే ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలే చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రైతు మహాధర్నాకు హాజరైన హరీశ్‌ రావు ప్రసంగించకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం అత్యవసర పిలుపు మేరకు ఆయన వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

Updated Date - Aug 08 , 2025 | 04:39 AM