Biometric Attendance: డుమ్మా డాక్టర్లకు చెక్
ABN , Publish Date - Feb 20 , 2025 | 03:47 AM
విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లు, వైద్య సిబ్బంది విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,869 ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇకపై 1,869 ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు
డీహెచ్, టీవీవీపీ, ఆయుష్ ఆస్పత్రుల్లో అమలు
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా..
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లు, వైద్య సిబ్బంది విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,869 ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వైద్య కళాశాలల్లో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్(అబాస్) విధానాన్ని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎమ్‌సీ) అమలు చేస్తోంది. సరిగ్గా అదే విధానాన్ని మిగతా ఆస్పత్రుల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని 868 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్ పరిఽధిలోని 156 ఆస్పత్రులు, ఆయుష్ పరిధిలోని 845 ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాఽధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలకు వైద్యులు సకాలంలో రావడం లేదనే విషయాన్ని వెలుగులోకి తెస్తూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ‘‘పీహెచ్‌సీలకు చుట్టాలుగా వైద్యులు’’ అన్న కథనం ఇచ్చింది. వైద్యులు ఆస్పత్రులకు రాని విషయాన్ని సర్కారు చాలా సీరియ్‌సగా తీసుకుంది. బుధవారం వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దీనిపై సమీక్ష నిర్వహించారు. డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ, ఆయుష్ విభాగాధిపతులతో సమావేశయ్యారు. ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
టీజీటీఎస్ సహకారంతో బయోమెట్రిక్ హాజరు
సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో పేదలు ప్రైవేటుకు వెళ్తున్నారు. ఇటీవల విభాగాఽధిపతుల వరుస తనిఖీల్లో చాలా ఆస్పత్రుల్లో వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్తున్నట్లు వెల్లడైంది. దీనికితోడు ప్రజాప్రతినిధులు నుంచి కూడా వైద్య శాఖ మంత్రికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని వైద్యులకే కాకుండా ఇతర పారామెడికల్ సిబ్బంది అందరికీ వర్తింపజేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వైద్యులు, సిబ్బందిని కూడా దీని పరిధిలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతా దీనిని అమలు చేయాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది. రూ.కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించి.. పరికరాలు, ఔషధాలు అందుబాటులో ఉంచినా.. వైద్యులు లేకపోవడం, ఆస్పత్రులకు రాకపోవడంతో అవి నిరూపయోగంగా మారుతున్నాయి. వైద్యులు లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా, ఇప్పటికే సచివాలయంతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో ఆధార్ ఆధారిత ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసె్‌స(టీజీటీఎస్) సాంకేతిక సహకారం అందిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ సైతం టీఎజీటీఎస్ సహకారం తీసుకోనుంది. ఒక ఉద్యోగి నెల హాజరు నిర్వహణ వ్యయం సుమారు రూపాయిన్నర వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ లెక్కన డీహెచ్ విభాగంలో సుమారు 18 వేల మంది, టీవీవీపీ పరిఽధిలో 13వేల మంది, ఆయు్‌షలో సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ నెలకు సగటున రూ.25-30 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
మంత్రితో పాటు హెచ్‌వోడీలందరికీ యాక్సెస్
టీజీటీఎస్ సహకారంతో రూపొందించే యాప్‌లో ప్రతీ ఉద్యోగికి ఒక ఐడీని కేటాయిస్తారు. దాని ద్వారా వారి అటెండెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎన్ని సెలువులు పెట్టారు..? ఇంకెన్ని ఉన్నాయి..? అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగి హాజరు శాతం ఆఽధారంగా వేతనాలు ఇచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ యాప్ యాక్సె్‌సను వైద్య శాఖ మంత్రితో పాటు ఆ శాఖ సెక్రటరీ, విభాగాధిపపతులతో పాటు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సలకు ఇస్తారు. దాంతో రాష్ట్రంలోని ఏ ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, వైద్య సిబ్బంది హాజరునైనా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చని ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా కచ్చితంగా సర్కారీ దవాఖానల్లో సిబ్బంది హాజరు శాతం మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని ధీమాగా ఉంది.
Also Read:
వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు
యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..
For More Telangana News and Telugu News..