Share News

Vajpayee Birth Anniversary: వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:41 PM

మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్‌పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు.

Vajpayee Birth Anniversary: వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య నాయుడు

హైదరాబాద్, డిసెంబర్ 23: మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్‌పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఇతర నాయకులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ‌పేయి జీవితం గురించి, ఆయన పరిపాలనా దక్షత గురించి వెంకయ్య నాయుడు కీలక ప్రసంగం చేశారు. బీజేపీకి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్‌పేయి ముందు వరుసలో ఉంటారని కీర్తించారు. వాజ్‌పేయిని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ శిష్యుడిగా ఎంచుకున్నారని చెప్పారు. వాజ్‌పేయి పాలన అంటే సుపరిపాలన అని.. యువతకు వాజ్‌పేయ్ ఆదర్శనం అన్నారు వెంకయ్య. తాను పదవి విరమణ మాత్రమే చేశానని.. పెదవి విరమణ చేయలేదన్నారు. వాజ్‌పేయి చూపిన మార్గంలో నడుస్తున్నామా? లేదా? అనేది ప్రతీ కార్యకర్త ఆలోచించుకోవాలని సూచించారాయన. నైతిక పాలన, సామాజిక బాధ్యత, రాజ్యాంగం పట్ల అంకిత భావంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగితే అంకిత భావంతో పని చేసినట్లు కాదన్నారు. రాజకీయ నాయకులకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటు అయిపోయిందంటూ ప్రస్తుత నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు. రాజకీయ నాయకులు శత్రువులు కాదని.. కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పారు.


భారత్‌ను శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టిన వ్యక్తి వాజ్‌పేయ్ అని చెప్పారు. ‘నా వల్లే చదువుకుంటున్నారు.. నా వల్లే యుద్ధాలు ఆగిపోతున్నాయని ట్రంప్ చెప్పుకోవడం ఏమాత్రం సరైనది కాదు.’ అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత సమాజంలో వ్యక్తులు స్వార్థం కోసం పని చేస్తున్నారు.. వాజ్‌పేయి శాంతిని ప్రేమించే వారు.. దేశ రక్షణ విషయంలో కఠినంగా ఉండేవారు. పీవీ సంస్కరణలు తీసుకువస్తే.. ఆ సంస్కరణలను ఆచరణలోకి తెచ్చిన వ్యక్తి వాజ్‌పేయి. ఆయనను ప్రత్యర్థులు కూడా అజాత శత్రువు అని పిలిచే వారు. గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో రోడ్లు వేయించింది వాజ్‌పేయి.’ అని చెప్పారు వెంకయ్య.


రాజనీతి, దౌత్య నీతి ప్రదర్శించే వ్యక్తి మోదీ అంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు వెంకయ్యనాయుడు. ఆపరేషన్ సింధూర్‌ ను విజయవంతం చేసిన ఆర్మీ, శాస్త్రవేత్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు మాజీ ఉపరాష్ట్రపతి. ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటిస్తూ.. ప్రజలను సోమరిపోతులను తయారు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారాయన. ఉచిత బస్సు ఇవ్వమని మహిళలు అడిగారా? అని ప్రశ్నించారు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచించారు వెంకయ్య. ఉచితాలకు స్వస్తి పలికి.. కష్టపడే వారికి చేయూతనివ్వాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను ప్రోత్సహించకూడదన్నారు వెంకయ్య.


Also Read:

TG Irrigation Department: ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ

Grede Priyandana: టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Fresh vs Dried Figs: తాజా VS ఎండిన అంజీర.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Updated Date - Dec 23 , 2025 | 04:41 PM