Foreign Infiltrators: చొరబాటుదారులను పట్టేదెలా?
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:43 AM
భారతీయులుగా గుర్తింపు పొందడానికి ఏం కావాలి..? ఆధార్, ఓటర్ ఐడీ ఉంటే చాలు. వాటిని ఆధారంగా చూపి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సహా ఇతర అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులను పొందవచ్చు.
అక్రమార్కులతో ఎస్‌బీ పోలీసులకు ఇబ్బందులు
విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో తిష్ట
స్థానిక నేతల అండతో ఆధార్, ఓటర్ ఐడీలు
వాటి ఆధారంగా సులభంగా పాస్ పోర్టులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): భారతీయులుగా గుర్తింపు పొందడానికి ఏం కావాలి..? ఆధార్, ఓటర్ ఐడీ ఉంటే చాలు. వాటిని ఆధారంగా చూపి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సహా ఇతర అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులను పొందవచ్చు. విదేశీ చొరబాటుదారులు ఇక్కడే తెలివి ప్రదర్శిస్తున్నారు. అడ్డదారిలో ఆధార్, ఓటర్ కార్డులను పొంది స్థానికులుగా చెలామణి అవుతున్నారు. ప్రభుత్వ పథకాలను పొందడంతో పాటు పాస్‌పోర్టులూ సంపాదిస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులను గుర్తించడం పోలీసులకు కష్టంగా ఉంటోంది. ప్రధాన గుర్తింపు కార్డులు ఉండటం, స్థానికుల నుంచి ఎలాంటి నెగిటివ్ రిపోర్టు రాకపోవడంతో పోలీసుల క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్రమంగా భారత్‌కు వలస వచ్చి.. హైదరాబాద్‌లో ఉంటు న్న వారిలో ఎక్కువ మంది పాతనగరంతో పాటు పలు ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. వారంతా ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చినట్లు నమ్మించి స్థానికులతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. స్థానిక నేతల సహకారంతో అడ్డదారిలో ఆధార్, ఓటర్ కార్డులు పొందుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటుపడిన నాయకులు నకిలీ పత్రాలను సమర్పించి వేలాది మందిని కొత్త ఓటర్లుగా నమోదు చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
నగరంలో ఉంటున్న భార్య, కొడుకును చూడటానికి పాకిస్థాన్ నుంచి అక్రమ మార్గంలో ఇండియాకు చేరుకొని హైదరాబాద్‌లో అత్తారింట్లో తలదాచుకున్న మహ్మద్ ఫయాజ్‌ను 2023లో బహదూర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని హైదరాబాద్ వాసిగా గుర్తించడానికి ఫయాజ్ అత్తామామలు కొంతమంది మధ్యవర్తుల సహకారంతో బర్త్ సర్టిఫికెట్ సంపాదించారు. ఆ తర్వాత ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేశారు. అది ప్రాసె్‌సలో ఉండగానే ఫయాజ్ పోలీసులకు చిక్కాడు. నాలుగు రోజుల క్రితం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన మహ్మద్ హసీబుల్ అలియాస్ జోవన్ చౌదరి(25), రోమన్ సాహ అలియాస్ రహన్(21)లను విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు అక్రమార్కులు నాలుగేళ్ల క్రితం రూ. 25వేలు చెల్లించి బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి అక్రమమార్గంలో ఇండియాలోకి ప్రవేశించారు. మూడేళ్లకు పైగా కోల్‌కతాలోని సౌత్‌హారాలో ఉన్నారు. హసీబుల్ ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన హైదరాబాద్ మలక్‌పేకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పది నెలల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చి స్విగ్గీ, జోమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక నేతల సహకారంతో బర్త్ సర్టిఫికెట్ సంపాదించి ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. అక్రమ వలసదారులుగా వచ్చి నగరంలో తిష్టవేసిన మయన్మార్‌కు చెందిన సుమారు 70 వేల కుటుంబాల్లో ఇప్పటికే వేలాది మంది ఓటర్ కార్డులు, ఆధార్‌లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు పరిశీలనలో బయటపడని అక్రమార్కులు..
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు అవసరమైన ఆధార్, ఓటర్, పాన్‌కార్డులను అభ్యర్థి సిద్ధం చేసుకుని పోలీసులకు చూపిస్తాడు. స్థానికులు పాజిటివ్ రిపోర్టు ఇవ్వడంతో ఎస్‌బీ అధికారులు పాస్‌పోర్టుకు క్లియరెన్స్ ఇస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఏదో నగరంలోనో, వేరే రాష్ట్రంలోనో నేరాలు చేసినప్పుడు, అక్రమ పాస్‌పోర్టు సైతం పొందినట్లు వెలుగులోకి వస్తుంది. దీంతో క్షేత్రస్థాయి విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేశారని వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News