Agriculture Crisis: అయ్యా.. యూరియా!
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:50 AM
రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు.
ఒక్క బస్తానైనా ఇవ్వండంటూ రైతుల వేడుకోలు
ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకోలు.. తెల్లవారకముందే లైన్లలో..
రాష్ట్రానికి మరో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా
కేంద్రం నిర్ణయం.. వారంలోనే ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు. పంటలకు ఎరువులు లేకపోతే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో తెల్లవారముందే కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓపిగ్గా క్యూలో నిల్చుంటున్నారు. యూరియా ఇవ్వాలంటూ కొన్నిచోట్ల సిబ్బంది కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల ఓపిక నశించి కన్నెర్ర చేస్తున్నారు. రాస్తారోకోలతో ఆందోళనలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా కనిపించాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం (పీఏసీఎ్‌స)కు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సోమారంకుంట తండాకు చెందిన గిరిజన రైతు బానోత్ వీరన్న తనకు రెండు బస్తాల యూరియా ఇవ్వాలంటూ అక్కడి సిబ్బంది కాళ్లు పట్టుకున్నాడు. దీనికి సంబంఽధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యూరియా దొరకడం లేదనే ఆగ్రహంతో మెదక్ జిల్లా చిన్నకోడూరు, నంగునూరు, చేగుంట, సిద్దిపేట రూరల్, నర్సాపూర్, మిర్‌దొడ్డి, గజ్వేల్, హుస్నాబాద్, కొల్చారం, రామాయంపేట తదితర మండలాల్లో రైతులు రాస్తారోకో చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఖమ్మం-వరంగల్ హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో సరుకు గంటల్లోనే అయిపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. ఆత్మకూరులో తనకు యూరియా బస్తా దొరకదనే ఆందోళనతో ఓ వృద్ధరైతు అక్కడున్న చెప్పుల వరుసలోనే పడుకున్నాడు. గద్వాల రూరల్‌లో, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, పెద్దకొత్తపల్లిలో రైతులు ఆందోళన నిర్వహించారు. కాగా నల్లగొండ జిల్లా తిప్పర్తిలో తెల్లవారుజామున 3 గంటలకే 250 మంది రైతులు ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల (పీఏసీఎస్) వద్దకు చేరుకొని 9గంటల వరకు క్యూలో నిల్చున్నారు. అక్కడి సిబ్బంది రైతులకు తలా ఓ బస్తా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో 240 మంది రైతులకు ఒక బస్తా చొప్పున అందజేశారు. కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో 225 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున ఇచ్చారు.
ఆ షాపులపై అధికారుల కొరడా
ఎరువుల నియంత్రణ చట్టాన్ని అతిక్రమించి షాపులు నిర్వహిస్తుండటంతో మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్‌లో 3, కురివిలో 2 సహా వివిధ మండలాల్లో మొత్తంగా తొమ్మిది ఎరువుల దుకాణాల లైసెన్సులను జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా రద్దు చేశారు. గిరాకీ లేని సరుకులను వదిలించుకునేందుకు ఇతర ఎరువులు, పురుగుల మందులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటూ రైతులకు తేల్చి చెబుతున్న వ్యాపారులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని చింతకాని, నేలకొండపల్లి, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని పలు దుకాణాలపై అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. యూరియా కోసం వెళ్లిన రైతులకు ఇతర ఎరువులు ట్యాగ్‌చేసి అమ్ముతున్నట్టు గుర్తించి ఐదు ఎరువుల దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్టు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులకు సమాచారమిచ్చామని వెల్లడించారు.
ఆ సరుకు వారంలోనే ఇవ్వండి
ఇక రాష్ట్రానికి 50వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ యూరియాను ఈ వారంలోనే సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో చేసిన నిరసన ప్రదర్శనతో కేంద్రానికి పరిస్థితులు తెలిశాయని తెలిపారు. కాగా కర్ణాటక నుంచి 10,800 టన్నుల యూరియా మొదటి షిప్‌మెంట్ ప్రారంభమైందని.. ఈవారంలో మరో మూడు షిప్‌మెంట్ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలు వారి అనుచరులను యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూలైన్‌లో పెట్టి యూరియా కొరతపై రైతాంగం ఆందోళన చెందే విధంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా... ఇప్పటివరకు 5.42 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేశారు. కేటాయించిన యూరియాలో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడంతోనే రైతుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News