Urea shortage: యూరియా వెతల వరుస
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:24 AM
వినాయక చవితి పండుగ పనులు మానుకొని మరీ యూరియా కోసం క్యూలైన్లలో ఓపిగ్గా నిల్చున్నారు రైతులు! ఎప్పటిలాగే తమ వంతు వచ్చేసరికి సరుకు నిండుకోవడం వారిని ఆగ్రహం తెప్పించింది.
యూరియా కోసం చాంతాడంత క్యూలు. రైతుల్లో ఆగ్రహం.. ధర్నాలు, రాస్తారోకోలు
యూరియా సమస్యలు తీరుస్తాం: తుమ్మల
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): వినాయక చవితి పండుగ పనులు మానుకొని మరీ యూరియా కోసం క్యూలైన్లలో ఓపిగ్గా నిల్చున్నారు రైతులు! ఎప్పటిలాగే తమ వంతు వచ్చేసరికి సరుకు నిండుకోవడం వారిని ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా యూరియా కోసం రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పండుగకు ముందురోజు, మంగళవారం కూడా యూరియా కోసం రైతులు ఆందోళన కొనసాగింది. తాను చంటిబిడ్డను ఎత్తుకొని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రెండ్రోజులుగా క్యూలైన్లో నిల్చున్నా యూరియా దొరకలేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లాలోని శివ్వంపేటలో రాత్రి 11 గంటల నుంచే చెప్పులు, ఇటుకలు వరుసగా పెట్టి రైతులు యూరియా కోసం నిరీక్షించారు. జిల్లాలోని పుల్కల్, జిన్నారం, తొగుట, కంది, మద్దూరు, హుస్నాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా రైతులు బారుల తీరారు. దౌల్తాబాద్‌లో జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ టోకెన్లు ఉన్న రైతులకు కాకుండా మండలంలోని నర్సంపేట గ్రామంలో సోమవారం రాత్రి రహస్యంగా ఒక్కోటి రూ.360 చొప్పున 560 బస్తాలను అక్రమంగా విక్రయించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది టోకెన్లు తీసుకున్న రైతులకు తెలియడంతో.. తమ వద్ద డబ్బులు తీసుకొని బయట విక్రయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఫర్టిలైజర్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. విచారణ చేసిన అధికారులు.. జ్యోతి ఫర్టిలైజర్, రోహిణి ఫర్టిలైజర్ దుకాణాలను సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్‌లో తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు క్యూలైన్లలో నిల్చున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ పరిధిలోని రైతులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పడిగాపులు పడ్డారు. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట వద్ద వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు క్యూలో నిల్చున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.
సమస్య పరిష్కరిస్తాం: తుమ్మల
యూరియా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గాయాలపాలైన ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా గజ్వేల్, సిద్దిపేట జిల్లాలో నెలకొన్న యూరియా సమస్యను మంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు.. అధికారులతో చర్చించి త్వరలోనే యూరియా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కాగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి తుమ్మల వస్తున్నారని తెలిసి.. ఆయిల్‌ఫెడ్ అధికారులు అక్కడికి వచ్చేందుకు కారులో బయలుదేరగా, వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్‌కుమార్, నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డిలు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ శివార్లలో ముందు వెళ్తున్న కారును అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డికి కంటి వద్ద గాయం అవగా, ఈడీ ప్రశాంత్‌కుమార్‌కు చెయ్యి విరిగింది. కాలికి తీవ్రగాయమైంది. ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి స్వల్ప గాయాలయ్యాయి. వారిని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల వారిని పరామర్శించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. తన సొంత వాహనంలో వారిని హైదరాబాద్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..