Fertilizer Shortage: యూరియా.. వరి మాయ
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:28 AM
గద్వాల జిల్లా మనవపాడు మండలం బోరవెల్లికి చెందిన ఎల్లారెడ్డి అనే రైతు యేటా మిర్చి సాగు చేస్తాడు. 15 ఎకరాల్లో తాను మిర్చి సాగు చేస్తానని.. సాగు మొదటి నుంచి చివరి దాకా ఎకరాకు 100 కిలోల చొప్పున యూరియా వినియోగిస్తానని చెప్పాడు.
రాష్ట్రంలో వరిసాగు పెరగడంతోనే యూరియాకు కొరత
పత్తి, మొక్కజొన్న సాగు నుంచి మళ్లుతున్న రైతులు
యాంత్రీకరణతో వరిసాగులో తగ్గిన కూలీల పాత్ర
శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలూ సులభం
సన్నాలకు బోనస్ ఇవ్వడంతోనూ పెరిగిన ఆసక్తి
వరిసాగులో అవసరానికి మించి యూరియా వినియోగం
ఎరువులు నిల్వ చేసుకోవడమూ కొరతకు కారణం
జోరు వానలోనూ యూరియా కోసం రైతుల బారులు
మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా మనవపాడు మండలం బోరవెల్లికి చెందిన ఎల్లారెడ్డి అనే రైతు యేటా మిర్చి సాగు చేస్తాడు. 15 ఎకరాల్లో తాను మిర్చి సాగు చేస్తానని.. సాగు మొదటి నుంచి చివరి దాకా ఎకరాకు 100 కిలోల చొప్పున యూరియా వినియోగిస్తానని చెప్పాడు. సాధారణ వినియోగం కన్నా ఎకరాకు 35 కిలోల చొప్పున ఎల్లారెడ్డి ఎక్కువగా చల్లుతున్నాడు. వాస్తవానికి పంటకు ఎకరాకు 65 కిలోల వరకు యూరియా సరిపోతుంది. మరో ఉదాహరణ.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గుడిమాల్కాపూర్‌కు చెందిన రవికుమార్ అనే రైతు నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. మునుపు ఎకరాకు 90 కిలోల చొప్పున యూరియా చల్లేవాడు. ఇప్పుడు 100 కిలోల నుంచి 130 కిలోల వరకు చల్లుతున్నానని చెబుతున్నాడు. యూరియా వేయకపోతే పంట ఏపుగా పెరగడం లేదని, కలుపు మందుల వాడకం వల్ల మొక్క ఎదగకపోతే యూరియాను వాడాల్సి వస్తోందని చెబుతున్నాడు. ఏడాదికి పది కిలోల యూరియా అదనంగా వాడకపోతే పంటకు ఇబ్బందవుతోందని అంటున్నాడు. రైతులు ఎల్లారెడ్డి, రవి కుమారే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఎక్కువమంది యూరియాను అవసరానికి మించి ఎక్కువగా చల్లుతున్నారు.
ఇందుకు వరిసాగు బాగా పెరగడం ఓ కారణం అయితే.. పంటలకు ఎక్కువగా చల్లితే పంట ఏపుగా పెరుగుతుందనే అభిప్రాయంతోనే చాలామంది యూరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం యూరియాకు తీవ్ర కొరత ఏర్పడటంతో రైతులు సింగిల్ విండోలు, ఆగ్రోస్, ప్రైవేటు ఫెర్టిలైజర్ల వద్ద బారులు తీరుతుండటం చూస్తున్నాం. ప్రస్తుతానికి అవసరం లేకున్నా, కావాల్సినప్పుడు దొరుకుతందో లేదోనన్న ఆందోళనతో కొందరు బడా రైతులు పెద్ద మొత్తంలో యూరియాను స్టాక్‌చేసి పెట్టుకోవడమూ యూరియా కొరత ఏర్పడటానికి ఓ కారణంగా చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో 23.07 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేవారు. ఈ సీజన్‌లో 67.5 లక్షల ఎకరాలకు చేరింది. అంటే 2014 నుంచి రాష్ట్రంలో వరిసాగు పెరుగుతూ వచ్చిందన్నమాట. అదే సమయంలో మిగతా ప్రధాన పంటలైన మొక్కజొన్న, పత్తి సాగును రైతులు తగ్గిస్తున్నారు. 2014-15 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగు 41.57 లక్షల ఎకరాల్లో సాగైతే, గత సంవత్సరం 43.48 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 5.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. మిగతా పంటలైన జొన్న, కంది వంటి పంటల సాగు కూడా పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఇందుకు వరిసాగులో యాంత్రీకరణ పెరగడం, కూలీలు తక్కువగా అవసరపడటం, ఫలితంగా పెట్టుబడి భారం తగ్గడమే కారణం. ప్రభుత్వం నిరుటి నుంచి సన్నాలకు బోనస్ రూ. 500 అందిస్తుండటం, ధాన్యం విక్రయాలు మిగతా పంటలతో పోల్చితే వేగంగా, సులభంగా జరగడం మరో కారణంగా చెప్పవచ్చు.
యూరియా అధిక వాడకంతోనూ సమస్యే
పంటల సాగులో యూరియా అధిక వినియోగం వల్ల ముప్పు ఏర్పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. యూరియాకు బదులుగా సహజ ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు వాడాలని సూచిస్తున్నాయి. రైతులు పశువుల పెంపకం తగ్గించడంతో సహజ ఎరువుల వినియోగం దాదాపుగా తగ్గిపోయింది. కాంప్లెక్స్ ఎరువులైన డీఏపీ రూ. 1530, 20-20-0-13 రూ. 1350, 28-28-28-0 రూ. 1700, 19-19-19 రూ. 1950, 10-26-26, రూ. 1800, 24-24-0 రూ. 1900ల ధర పలుకుతున్నాయి. వెంటనే పంట ఏపుగా ఎదగడం కోసం రైతులు తక్కువ ధర రూ. 266కే దొరికే యూరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వరిలో సాధారణంగా పోటా్‌షతో కలిపి వేస్తే 60 కేజీల యూరియా, 35 కేజీల పొటాష్ వాడాలి.
ఒకవేళ పొటాష్ కలపకపోతే 90 కేజీల వరకు వినియోగించవచ్చు. కానీ 135 కేజీల నుంచి 150 కేజీల వరకు రైతులు పంట చివరి వరకు యూరియాను వినియోగిస్తున్నారు. ఇది సాధారణంగా వాడాల్సిన మోతాదు కంటే దాదాపు రెట్టింపుగా ఉంటోంది. ఇటీవలి కాలంలో కలుపు కూలీలను తగ్గించుకునేందుకు ముందుగానే రైతులు గడ్డి మందు వేయడం పెరిగింది. గడ్డి మందు ప్రభావంతో పంట ఎదగడం ఆలస్యమవుతోంది. ఈ కారణంతో కూడా రైతులు యూరియాను చల్లుతున్నారు. లేకపోతే పంట ఏపుగా పెరగదని చెబుతున్నారు. మిర్చి విషయానికొస్తే ఎకరాకు 65 కేజీల వరకు పంట చివరి వరకు వినియోగించాలి. కానీ దాదాపు 100 కేజీలపైనే ఎకరాకు వాడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..