Suravaram Sudhakar Reddy: సురవరానికి తుది వీడ్కోలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:27 AM
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.
ప్రజల సందర్శనార్థం సీపీఐ ఆఫీసులో భౌతిక కాయం
రేవంత్, చంద్రబాబు, వెంకయ్య సహా ప్రముఖుల నివాళి
అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర
గాంధీ వైద్య కళాశాలకు భౌతిక కాయం అప్పగింత
సురవరం పేరు నిలిచిపోయేలా చేస్తాం: సీఎం రేవంత్
సుధాకర్‌రెడ్డి మృతి తీరని లోటు: ఏపీ సీఎం చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. అక్కడ ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు సురవరం భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించేందుకు అంతిమ యాత్ర మొదలైంది. ఇందులో భాగంగా హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు పోలీసుల మార్చ్ సాగింది. అక్కడి నుంచి రెడ్ వాలంటీర్లు కవాతు చేశారు. నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్ మీదుగా యాత్ర సాగింది. సాయంత్రం 4.45 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అంటూ కార్యకర్తలు పాటలు పాడుతూ సుధాకర్‌రెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు.
రేవంత్, చంద్రబాబు నివాళి..
సీపీఐ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి పేరును శాశ్వతంగా గుర్తుండేలా చేస్తామని, ఈ మేరకు క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. మఖ్దూం భవన్‌లో సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును హార్టికల్చర్ యూనివర్సిటీకి, జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నామకరణం చేసి వారిని గౌరవించుకున్నామని, అదే కోవలో సుధాకర్‌రెడ్డి పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తామని తెలిపారు. సుధాకర్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారని కొనియాడారు. సురవరం మృతి సీపీఐకి, దేశానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి చంద్రబాబు అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని అన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించి, సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, జానారెడ్డి, కోదండరాం తదితరులు సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించారు.
సురవరం మద్దతు మరువలేనిది : కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సురవరం భౌతిక కాయానికి ఆది వారం ఆయన నివాళులు అర్పించారు. సురవరంతో ఉన్న అనుభవాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారని, కేసీఆర్ తరఫున సుధాకర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, పలువురు బీఆర్‌ఎస్ నేతలు సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, జయ ప్రకాష్ నారాయణ, మాజీ సీజేఐ ఎన్వీ రమణ తదితరులు సుధాకర్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
సురవరం మా తొలి ఫ్రొఫెసర్
సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించడం స్ఫూర్తిదాయకం. ఆయన గాంధీ కళాశాల విద్యార్థులకు తొలి అనాటమీ ప్రొఫెసర్ అవుతారు. ఆయన శరీరం ద్వారా ఎంతో మంది విద్యార్థులు వైద్య శాస్త్రాన్ని నేర్చుకుంటారు. మరణంలోనూ సేవ చేయాలన్న ఆయన ఆశయం మాకు గొప్ప స్ఫూర్తి. ఆయన కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
- ఇందిర, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News