Share News

Bhatti Vikramarka: బీసీ కోటాకు న్యాయమెలా?

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:07 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై న్యాయకోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది.

Bhatti Vikramarka: బీసీ కోటాకు న్యాయమెలా?

  • నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల కమిటీ

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో సంప్రదింపులు

  • ప్రముఖ న్యాయకోవిదులు, నిపుణులతోనూ

  • సీఎం రేవంత్‌ కూడా హాజరయ్యే అవకాశం!

  • నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి.. రేపు బిహార్‌కు..

  • రాహుల్‌ పాదయాత్రలో పాల్గొననున్న సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై న్యాయకోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీ.. ఢిల్లీలో జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిని సంప్రదించనుంది. ఆయనతోపాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయాలనూ తీసుకోనుంది. ఆదివారం ప్రజాభవన్‌లో సమావేశమైన మంత్రుల కమిటీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులను సంప్రదించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్కతో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కమిటీ.. న్యాయకోవిదులతో సంప్రదింపుల ప్రక్రియను మంగళవారం కల్లా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రజాభవన్‌లో కమిటీ సమావేశమై.. రిజర్వేషన్ల విషయంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తున్నారు? వంటి అంశాలను ప్రాథమికంగా పరిశీలించింది. న్యాయపరంగా వివాదాలు రాకుండా.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయాన్ని మంత్రులు తెలుసుకున్నారు. విస్తృత అభిప్రాయ సేకరణకుగాను జాతీయ స్థాయిలో ప్రముఖ న్యాయ కోవిదులు,రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.


బిహార్‌ టూర్‌.. వయా ఢిల్లీ..

రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను అధ్యయనం చేసి.. సూచనలు చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయాన్ని సోమవారం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆయనతోపాటు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మనుసింఘ్వీ సలహా కూడా తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి.. సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. దీంతో శ్రీధర్‌బాబు మినహా మంత్రుల కమిటీ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితోపాటు ఇతర న్యాయ కోవిదులనూ కలిసి అభిప్రాయం తీసుకోనున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి కూడా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి బిహార్‌ రాజధాని పట్నాకు చేరుకుంటారు. ‘ఓటు చోరీ’ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రస్తుతం బిహార్‌లో చేస్తున్న పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. రేవంత్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొననున్నారు. ఢిల్లీ మీదుగా బిహార్‌కు చేరుకోనున్నారు. కాగా, సోమవారం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, అభిషేక్‌ మనుసింఘ్వితో మంత్రుల కమిటీ భేటీలో సీఎం రేవంత్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 04:14 AM