AV Ranganath: బాధ్యులపై చర్యలకు ఆదేశం..
ABN , Publish Date - Sep 13 , 2025 | 08:34 AM
యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
- క్యాచ్‌పిట్‌లో చిన్నారి ఘటనను తీవ్రంగా పరిగణించిన హైడ్రా
- ఇద్దరు సూపర్ వైజర్లకు డిమోషన్.. మూతలు తెరిచి ఉంటే 90001 13667కు ఫోన్ చేయండి: రంగనాథ్
హైదరాబాద్ సిటీ: యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్ ప్రమాద ఘటనను హైడ్రా(HYDRA) తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్న సమగ్ర సమాచారం తీసుకున్న ఆయన డీఆర్‌ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరు, వర్షాకాల అత్యవసర బృందాల సిబ్బంది ఇద్దరి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు.

డీఆర్‌ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికి డిమోషన్ ఇచ్చారు. అత్యవసర బృందంలోని ఇద్దరు సభ్యులను తొలగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన రంగనాథ్.. వ్యర్థాలు తొలగించిన చోట వెంటనే క్యాచ్‌పిట్ మూతలు పెట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా క్యాచ్‌పిట్, మ్యాన్‌హోళ్లపై మూతలు లేకుంటే జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మ్యాన్‌హోల్, క్యాచ్‌పిట్ల మూతలు తెరిచి ఉంటే 90001 13667 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని నగరవాసులను రంగనాథ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News