Share News

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:52 AM

ఎవరు అడ్డం పడినా.. అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునురుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు గానీ.. మూసీ శుద్ధి జరగొద్దా?

  • పదేళ్ల పాలనలో హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచనే.. బీఆర్‌ఎస్‌కు రాలేదు

  • తాటిచెట్టంత మనిషి.. మెదడు మోకాలులోనూ లేదు

  • ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు

  • అది కూడా కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే

  • ప్రాణహిత-చేవెళ్లలోనూ మల్లన్నసాగర్‌ ప్రతిపాదన ఉంది

  • కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులను ఆపొద్దు

  • విపక్ష నేతల కుట్రలు తిప్పికొడతాం.. సంగతి తేలుస్తాం

  • ప్రతిపక్షాలు అభివృద్ధిలో కలిసి రావాలి: సీఎం రేవంత్‌

  • గోదావరి ఫేజ్‌- 2, 3, మూసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన’

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘ఎవరు అడ్డం పడినా.. అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునురుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్‌లో మోదీ ఆధ్వర్యంలో సబర్మతి నది, యూపీలో యోగి నేతృత్వంలో గంగా నది, ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో యమునా నది తీరప్రాంత అభివృద్ధి పనులు చేపట్టారని, 4 కోట్ల ప్రజలు ఉన్న తెలంగాణలో మూసీ తీర ప్రాంత అభివృద్ధి జరగొద్దా? అని ప్రశ్నించారు. రూ.7,360కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2, 3, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సోమవారం గండిపేట వద్ద రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిజాం పాలకుల దూర దృష్టి వల్లే హైదరాబాద్‌కు ముంపు ముప్పు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. 1920, 1922లో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల నిర్మాణం పూర్తయితే.. వందేళ్లుగా హైదరాబాద్‌ దాహర్తి తీరుతోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌కు మంజీరా, కృష్ణా, గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులు చేపట్టారని గుర్తు చేశారు. గతంలో సచివాలయం ముందు ఖాళీ బిందెలు, కుండల ప్రదర్శనలు జరిగేవని, అలాంటి ఇబ్బందులన్నింటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే పరిష్కారం చూపిందన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్‌కు నీటి సరఫరా జరుగుతోందని, అది కూడా కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిందేనని పేర్కొన్నారు. సీఎంగా వైఎస్సార్‌, మంత్రిగా శ్రీధర్‌బాబు ఉన్నప్పుడు ప్రాజెక్టును ప్రారంభించగా... 2016లో హైదరాబాద్‌కు నీళ్లు వచ్చాయన్నారు. నాడు మునిసిపల్‌ మంత్రిగా ఉన్న ఒకాయన శామీర్‌పేట వద్ద నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నాడని, నీళ్లు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు పోవని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఒకాయన తాటి చెట్టులా పెరిగాడే కానీ.. మోకాలులోనూ మెదడు లేదు. కాళేశ్వరం నీళ్లు మల్లన్నసాగర్‌ నుంచి తీసుకుంటున్నారంటూ అర్ధరహితంగా మాట్లాడుతున్నడు’ అని హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును మీ తాత లేదా ముత్తాత కట్టారా? ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ (ప్రతిపాదిత ప్రణాళికలోని తడ్కపల్లి చెరువును ఉద్దేశిస్తూ) లేదా? అని నిలదీశారు. కాసుల కక్కుర్తితో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన బ్యారేజీని మేడిగడ్డలో నిర్మించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందన్నారు. ‘మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతున్నం.. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టేందుకు అనుమతి అడిగాం. త్వరలో అక్కడకు వెళ్తా. వాస్తవానికి 148మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టేందుకు గతంలోనే ఒప్పందం జరిగింది. మధ్యే మార్గంగా 149-150 మీటర్లు ఎత్తులో ప్రాజెక్టును నిర్మించి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తాం’’ అని పేర్కొన్నారు. గోదావరి జలాలు తరలించడం ద్వారా చేవెళ్ల, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ ప్రజలను ఆదుకుంటామన్నారు.


పదేళ్లలో బీఆర్‌ఎ్‌సకు ఆ ఆలోచనే రాలేదు

పదేళ్ల పాలనలో గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తరలించాలన్న ఆలోచనే చేయని ఘనత బీఆర్‌ఎ్‌సది అని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికలకు ముందు నల్లగొండలో ప్రచారానికి వెళ్లినప్పుడు.. అన్నా మూసీ నది మాకు విషం ఇస్తోందని అక్కడి ప్రజలు చెప్పారు. ఆనాడే వారికి మాట ఇచ్చా. అందుకే పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం. తద్వారా హైదరాబాద్‌నూ సుందర నగరంగా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. ఎవరు అడ్డం పడినా, ఒక్కొక్క అవాంతరాన్ని అధిగమించుకుంటూ వెళ్తామని స్పష్టం చేశారు. రూ.7360 కోట్లతో 20 టీఎంసీల గోదావరి జలాలను జంట జలాశయాలకు తీసుకువస్తున్నామని, ఇందులో 15, 16 టీఎంసీలు హైదరాబాద్‌ దాహార్తి తీర్చేందుకు, పరిసర ప్రాంతాల్లోని చెరువులు నింపేందుకు వినియోగిస్తామన్నారు. 4, 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు వాడనున్నట్టు తెలిపారు. మురికి కూపంగా మారిన మూసీ నదిని అద్భుతంగా మార్చుకుందామా? వద్దా? అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రె్‌సకు మంచి పేరు వస్తుందనే కొందరు దుర్మార్గులు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ‘రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులను ఆపొద్దు. కలిసి రండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి’ అని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ కింద బుద్వేల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, మూడేళ్లలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వచ్చే వందేళ్లు రాష్ట్రం, హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన ప్రణాళికతో తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ తీసుకొస్తున్నామని, డిసెంబరు 9న జాతికి అంకితం చేస్తామన్నారు. విపక్ష నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడినా ప్రభుత్వం తిప్పికొడుతుందని, ఒక్కొక్కరి సంగతి తేలుస్తుందని అన్నారు. ‘ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదల రాజ్యం.. పేదలకు న్యాయం జరుగుతుంది’ అని ఉద్ఘాటించారు.


ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ ప్రారంభోత్సవం

కోకాపేట వద్ద హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌కు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌ (ఎగ్జిట్‌ 1ఏ) వల్ల ఇటు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, అటు పటాన్‌చెరు వైపు చేరుకోవడం మరింత సులభతరం కానుంది.


ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఇండియా కూటమి తరపున జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అనంతరం సీఎం రేవంత్‌ పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని, రైలు మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తరభాగానికి టెండర్లను ఆహ్వానించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. హైదరాబాద్‌- కరీంనగర్‌- రామగుండం మార్గంలో కొత్త అలైన్‌మెంట్‌ను ఆమోదించాలని, మెట్రో రెండో దశకు నిధులివ్వాలని కేంద్ర మంత్రులను కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఆలయాల అభివృ‌ద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

For More TG News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:52 AM