CM Revanth Reddy: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:21 AM
రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హరీశ్, సంతోష్ వెనుక అని కొందరు.. కవిత వెనుక ఉన్నారని మరికొందరు..
అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వారిని బండకేసి కొట్టాలి
నేను ఎవరి వెనుకా ఉండను.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ముందుంటా
అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక ఆ కుటుంబంలో పంచాయితీ
రాష్ట్రంలో మరే పార్టీ బతకవద్దనుకున్న బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోతోంది
పాలమూరు పేదరికానికి ఎగ్జిబిషన్ కాదు
అభివృద్ధి ప్రదర్శనకు వేదిక కావాలి: సీఎం
భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయించిన రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్/కామారెడ్డి/ఖమ్మం / కొత్తగూడెం / అశ్వారావుపేట / చండ్రుగొండ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీశ్‌రావు, సంతో్‌షరావు వెనుక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నానని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవాళ్లను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీలో నూతన యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమం, బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్న రూ.లక్షల కోట్ల సొమ్ము పంపకం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. బావ, అన్న, చెల్లి కత్తులు, బల్లేలతో పొడుచుకుంటున్నారు. ఉరుమిరిమి మంగళం మీద పడ్డట్టు.. వాళ్లు కొట్టుకుని మా పేర్లు తీసుకొస్తున్నారు. 2023 డిసెంబరులోనే బీఅర్‌ఎస్ అనే కాలనాగును తెలంగాణ ప్రజలు కొట్టి చంపారు. ఆనాడే చచ్చిన దాన్ని మళ్లీ నేను చంపాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
నేను రాష్ట్ర అభివృద్ధిలో ముందుంటా..
తాను ఎవరి వెనుక ఉండనని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ముందు ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీలోకి తమను లాగవద్దన్నారు. బీఆర్‌ఎస్ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు వంటిదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏ పార్టీనీ బతకనీయకూడదనే ఉద్దేశంతో ఎంతో మంది నాయకులను జైలుకు పంపి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రకృతి చాలా గొప్పదని, ఎన్నో పాపాలు చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోందని వ్యాఖ్యానించారు.
పాలమూరును అభివృద్ధి వేదికగా మార్చుతాం..
గతంలో పాలమూరు జిల్లా పేదరికాన్ని, కరువును ఇతర దేశాల వారికి ఒక ఎగ్జిబిషన్‌గా చూపించేవారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందని, పాలమూరును అభివృద్ధి ప్రదర్శనకు వేదికగా మార్చుతామని ప్రకటించారు. దేవరకద్రలో ఒక డ్రైపోర్టు నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూని ట్ ఏర్పాటు కోసం రక్షణ శాఖ పరిశీలన జరిపిందని తెలిపారు. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిని డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, వీర్లపల్లి శంకర్ , మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
ఇటీవల అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలు, రహదారులు, నీటమునగిన జనావాసాలను పరిశీలించి, వరద బాఽధితులను పరామర్శిస్తారు. సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులో ల్యాండ్ అవుతారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి.. లింగంపేట మండలంలో కుర్దు వద్ద తెగిపోయిన ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిని, బుడిగిద్ద గ్రామంలో దెబ్బతిన్న పంటలను, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత కాలనీలను పరిశీలిస్తారు. తర్వాత కామారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. కాగా, భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై అధికార యంత్రాంగం ఒక నివేదికను సిద్ధం చేసింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో రూ.210 కోట్లకుపైగా నష్టం జరిగిందని, అందులో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం రూ.38కోట్లు అవసరమవుతాయని గుర్తించింది. ఇక 334 గ్రామాల్లోని 49,984 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని.. 37,267 మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
సొంతింట్లోకి వెళ్లినట్టు ఉంది..: రేవంత్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గిరిజన గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ ప్రవేశాలు చేయించారు. బచ్చల రమణ ఇంటిని సీఎం రేవంత్, బచ్చల నర్సమ్మ ఇంటిని పొంగులేటి రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. వారితో కలిసి గారెలు, పరమాన్నం స్వీకరించారు. బచ్చల నర్సమ్మను సీఎం కుశల ప్రశ్నలు అడిగి ఆమె ఒడిలో ఉన్న మనవరాలు పాన్యశ్రీ వెన్సికకు గారెలు తినిపించారు. రమణ కుమార్తె రాజేశ్వరిని పలకరించారు. ‘అందరూ బాగున్నారా.. మంచిగా ఉన్నారా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ గ్రామంలో 312 ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇచ్చాం.. మీరంతా సంతోషమే కదా’ అని లబ్ధిదారులను అడిగారు. గ్రామంలో అందరూ పిల్లల్ని చదివించాలని, వారికి పెళ్లిళ్లు చేసిన అనంతరం వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో బొడ్డురాయికి పూజ లు చేశారు. అనంతరం దామరచర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. పేదరికాన్ని తరిమికొట్టాలన్న లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టామని చెప్పారు. పేదలు గృహప్రవేశం చేస్తుంటే తన సొంత ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నంత సంతోషంగా అనిపించిందని చెప్పారు.
కేసీఆర్ దత్తత గ్రామంలోనూ ఇందిరమ్మ ఇళ్లే: పొంగులేటి
కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లేందుకుదారి వెడల్పు చేసుకుని యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.. ఓ అవ్వ ఇంట్లో భోజనం చేసి, ఆమెతోపాటు గ్రామస్తులకు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చి, తర్వాత పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ అవ్వతోపాటు వాసాలమర్రిలో 119 కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. తల తాకట్టు పెట్టయినా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. కాగా, కేసీఆర్ అరాచక పాలనను కూకటి వేళ్లతో పెకిలించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఇక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అందరివాడు అని, ఆవేశమున్నా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసినవారని కొనియాడారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత