Share News

Ponguleti: మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:35 AM

సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగా మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలని ఆలోచన చేస్తున్నామని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Ponguleti: మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు

  • పాత ఫ్లాట్లకూ వర్తింపజేసే యోచన

  • త్వరలో తెలంగాణ స్టాంప్‌ సవరణ బిల్లు

  • అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే చాన్స్‌

  • అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

  • సామాన్యులపై భారం పడకుండా భూముల ధరలు సవరించాలని సూచన

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగా మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలని ఆలోచన చేస్తున్నామని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. దీంతోపాటు కొత్త, పాత అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు స్టాంప్‌ డ్యూటీ ప్రస్తుతం ఒకే విధంగా ఉందని, పాత అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్‌ తేదీలను పరిగణనలోకి తీసుకుని స్టాంప్‌ డ్యూటీ తగ్గించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. భారతీయ స్టాంప్‌ చట్టం-1899ని అనుసరించి త్వరలో తెలంగాణ స్టాంప్‌ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. సవరణ బిల్లు-2025పై శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ స్టాంప్‌ చట్టం-1899 ప్రకారం తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లు, 26 ఆర్టికల్స్‌ను సవరించేందుకు 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు.


ఈ బిల్లుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో సవరణ బిల్లును వెనక్కి పంపిందన్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాత బిల్లు స్థానంలో కొత్త బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉండాలని, కొత్త ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా బిల్లును రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్‌ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది..? అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది? వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, న్యాయ వ్యవహారాల కార్యదర్శి ఆర్‌. తిరుపతి, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎ్‌సడీ వేముల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


చట్ట సవరణ వల్ల ఉపయోగం ఏంటి..?

భారతీయ స్టాంప్‌ చట్టం-1899 ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సవరణల వల్ల ప్రభుత్వానికి, వ్యాపార వర్గాలకు వచ్చే ఉపయోగాలు ఏంటనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు చట్ట సవరణ దోహదపడుతుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అదనపు ఐజీ మువ్వా వెంకట రాజేష్‌ తెలిపారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్‌ సేవలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఫీజులు, స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌, ఇతర వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతోపాటు ఆయా వర్గాల నుంచి ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు సవరణలు దోహదపడతాయని పేర్కొన్నారు. సవరణల ద్వారా ఈ స్టాంపింగ్‌ విధానాన్ని అమల్లోకి తేవచ్చని, నకిలీ స్టాంప్‌ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లను నివారించేందుకు ఈ విధానం సహాయపడుతుందని చెప్పారు. కొత్త ఒప్పందాలపైనా స్టాంప్‌ డ్యూటీ విధించడం, కొత్త ఒప్పందాలు, కొత్త రకం లావాదేవీలకు సంబంధించిన (ఉదాహరణకు షేర్ల బదిలీ, ఫ్రాంచైజీ ఒప్పందాలు,) అంశాలను స్టాంప్‌ డ్యూటీ పరిధిలోకి తీసుకురావచ్చని ఆయన తెలిపారు.


స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడం(ఆన్‌లైన్‌ విధానం, బ్యాంక్‌ ఆథరైజ్డ్‌ సెంటర్లు) ద్వారా పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రయాస తగ్గుతుందని, అయితే ఈ విధానాన్ని ఇండియన్‌ బ్యాంకర్ల సంఘం వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎ్‌సడీ వేముల శ్రీనివాస్‌ తెలిపారు. కేంద్రం ఆమోదం తప్పనిసరి ఉన్న అంశాలను మినహాయించి.. రాష్ట్ర పరిధిలో సవరణకు వీలున్న అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త బిల్లును తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ సవరణల వల్ల రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పెరుగుతుందని, స్కామ్‌లు తగ్గుతాయని, ఈ గవర్నెన్స్‌ బలోపేతం అవుతుందని, పౌరులకు సులభతరమైన సేవలందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ తరహా సవరణలను ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో అమలో ఉన్నాయని, దీనివల్ల ఆయా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగిందని వారు పేర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 03:35 AM