CM Revanth Reddy: 9 రోజుల్లో 9 వేల కోట్లు!
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:26 AM
రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వానాకాలం సీజన్‌లో పంటలకు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతలు ఎవరి దగ్గరా చేయిచాచి, అప్పు అడగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.
70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు
ఏడాదిన్నరలో రైతుల కోసం లక్ష కోట్లు వెచ్చించాం
సన్నవడ్ల సాగుతోనే పేదలకు సన్నబియ్యం
అన్నదాతలు అంబానీ, అదానీలతో పోటీపడాలి
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం
బీఆర్‌ఎస్ పదేళ్లలో వందేళ్ల ఆర్థిక విధ్వంసం
కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు
ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే
వాళ్లు రోడ్లపై దొర్లినా పదేళ్లు మేమే ఉంటాం
రైతువేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
వానాకాలం ‘రైతుభరోసా’ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వానాకాలం సీజన్‌లో పంటలకు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతలు ఎవరి దగ్గరా చేయిచాచి, అప్పు అడగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అందుకే రైతు భరోసాను ఏకకాలంలో అమలు చేయాలని నిర్ణయించామన్నారు. సోమవారం నుంచి రాబోయే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 70,11,184 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతువేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉంది. మరో 1,034 రైతువేదికల్లో వీసీ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతువేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వానాకాలం రైతుభరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని మీట నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, బోనస్, రైతుబీమా అన్నీ కలిపి ఇప్పటి వరకు 18 నెలల్లోనే ఈ ప్రభుత్వం రైతుల కోసం రూ.1,01,728 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.
గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు దోచుకుంటే.. ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే లక్ష కోట్లు రైతులకు పంచిపెట్టిందని తెలిపారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరొచ్చినా రైతుల అండదండలు లేకుంటే ఏమీ చేయలేరన్నారు. వార్డు సభ్యుడు, సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, చివరకు ముఖ్యమంత్రి కావాలన్నా రైతుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యపడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అప్పుడే పది కాలాలపాటు కుర్చీ పదిలంగా ఉంటుందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో, గత పదేళ్లలో అధికారంలో ఉండి ఏమీ చేయనివారు ఇప్పుడు వీధి నాటకాలు ఆడుతూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో ప్రజల నెత్తిమీద అప్పు, రైతుల చేతిలో చిప్ప పెట్టడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు పదవీ విరమణ సొమ్ము, మొదటి తారీఖున వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. 2018 నుంచి 2023 వరకు రూ.11,500 కోట్ల రుణమాఫీ చేస్తే.. రూ.8,500 కోట్లు వడ్డీలకే పోయిందని, కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు.
వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని గత ప్రభుత్వం చెప్పిందని.. తమ ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధరతోపాటు సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తోందని గుర్తుచేశారు. రైతులకు వరి సాగు చేయొద్దని చెప్పి, వాళ్లు మాత్రం ఫాంహౌ్‌సలో 150 ఎకరాలు సాగు చేసి క్వింటా రూ.4,200 చొప్పున ధాన్యం అమ్ముకున్నారని తెలిపారు. రైతులు సన్నవడ్లు పండించడంతోనే పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయగలుగుతున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాదిలో 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడంలో, సన్నాలు సాగు చేయడంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు ఇంతకంటే సాధించే విజయం ఏమీ లేదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజుల నుంచి ఆత్మగౌరవంతో బతికే రోజులు తీసుకొచ్చామని తెలిపారు. రైతుల పిల్లలు ఉన్నత విద్యలు చదివి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎ్‌సలుగా స్థిరపడితే దేశంలో ఎక్కడున్నా సొంత ప్రాంతానికి మేలు చేస్తారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
పాత బిల్లులకు మమ్మల్ని నిందిస్తున్నారు..
బిల్లులు రాలేదని మాజీ సర్పంచులు ఆందోళనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి రాకముందు చేసిన పనులకు, మంజూరు కాని బిల్లులకు ఇప్పుడు తమను నిందిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లులు, ఉచిత విద్యుత్తు బకాయిలన్నీ కలిపి రూ.8.29 లక్షల కోట్లు అప్పు చేసి పోయారని తెలిపారు. ఆ అప్పులు మోయలేక తనకు నెత్తి నొస్తున్నదని, ఆర్థిక మంత్రి భట్టికి నడుము వంగిపోతున్నదని సీఎం అన్నారు. ‘‘అరే పిలగాడు కొత్తగా వచ్చిండు. కొంత సమయం ఇద్దామని లేదు. విద్యార్థులకు ప్రమాదం జరిగినా ఆనందమే. రైతులు చనిపోయినా, ప్రమాదాలు జరిగి జనం చనిపోయినా, ఆహారం విష పూరితమైనా, ఏం జరిగినా పైశాచిక ఆనందమే. ఇంతటి దుర్మార్గమైన ప్రతిపక్షాన్ని నేనెప్పుడూ చూడలేదు. చావుల పునాదులపై అధికారంలోకి రావాలనే దురాలోచన సరైంది కాదు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు. ‘‘గతంలో భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా వినేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 4 కోట్ల ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. సామాజిక న్యాయం పాటిస్తున్నాం.
గత ప్రభుత్వంలో ఒకేఒక్క దళితుడు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు నలుగురు మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్ కూడా దళితుడే ఉన్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఎలా పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు’’ అని సీఎం చెప్పారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చి వరసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే.. పోటీపరీక్షలు రాసే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని కాస్త సమయం అడిగే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు రాయితీపై పనిముట్లను అందించేవని, బీఆర్‌ఎస్ వచ్చాక నిలిపివేసిందని చెప్పారు. రైతులకు మళ్లీ వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించారు. రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం, ఏఐని అనుసంధానం చేయాలని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు ఖర్చు రూ.17 వేల కోట్లు అవుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు సౌర పంపు సెట్లను వినియోగించాలని, సౌర విద్యుత్తుతో ఆదాయం కూడా వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. రైతులు ఇకపై అదానీ, అంబానీలతో పోటీపడాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. సౌర పంపుసెట్ల వినియోగంపై అవగాహన ఉన్న రైతులను రైతువేదికలకు తీసుకెళ్లి ఇతర రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే వారికి రోజుకు రూ.1000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు.
ప్రజలే వారి పనిపట్టాలి!
పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, విధ్వంసం సృష్టించి బొందలగడ్డలా మార్చిన బీఆర్‌ఎస్ నేతలు టీవీల ముందు, జనం ముందు బలుపు మాటలు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘వాళ్లెన్ని తిట్లు తిట్టినా.. మాకు అవి ఆశీర్వాదాలే. వారి తిట్లను మేం పట్టించుకోవడం లేదు. నేను పనిచేస్తూ పోతుంటా. మీరు వాళ్ల పనిపట్టండి!’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు అడ్డొచ్చినా, బట్టలు చింపుకున్నా, రోడ్డుమీద పడుకొని దొర్లినా.. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News