Share News

CM Ravanth Reddy: పల్లెలకూ డ్రగ్స్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:50 AM

గతంలో పట్టణాలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందనుకునే గంజాయి, డ్రగ్స్‌ ఇప్పుడు గ్రామాల వరకూ చేరాయని, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు.

CM Ravanth Reddy: పల్లెలకూ డ్రగ్స్‌

గతంలో పట్టణాలకే పరిమితం.. నేడు ఊళ్లకూ వెళ్తున్నాయ్‌..

  • పిల్లలను కనిపెట్టుకుని ఉండండి

  • తప్పుదారి పట్టిన విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే

  • పిల్లలతో కలిసి మీరూ భోజనం చేయండి

  • కార్పొరేట్‌ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం

  • ఇందుకు ఏం చేయాలో చెప్పండి.. చేస్తా

  • మనమంతా బలమైన తెలంగాణను నిర్మిద్దాం

  • గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • తాము చేసిన పనులతో ప్రభుత్వ స్కూళ్లలో 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని వ్యాఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గతంలో పట్టణాలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందనుకునే గంజాయి, డ్రగ్స్‌ ఇప్పుడు గ్రామాల వరకూ చేరాయని, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ విద్యార్థులూ గంజాయి విక్రయదారులుగా ఉంటున్నారని, వారిని చూస్తే చాలా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదారి పట్టిన పిల్లల తల్లిదండ్రుల శోకం భరించలేనిదని, ఆ విద్యార్థులను దారి మళ్లించే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శిల్పకళా వేదికలో విద్యా శాఖ నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు చెప్పి మాట్లాడారు. ‘‘గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ‘ఈగల్‌’ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గంజాయి మొక్క మొలిచినా భరతం పట్టేందుకే దీనిని తీసుకొచ్చాం. పిల్లల భవిష్యత్తు కోసమే ఈ వ్యవస్థలన్నీ! విద్య కోసమే ఏడాదికి రూ.40 వేల కోట్లను ఖర్చు పెడుతున్నాం. పిల్లల భవిష్యత్తే.. దేశ భవిష్యత్తు. దానిని ఉపాధ్యాయులు చేతుల్లో పెడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు. దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులే ఉన్నారని, 11 వేల ప్రైవేటు స్కూళ్లలో మాత్రం 34 లక్షల మంది చదువుతున్నారని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రైవేటు టీచర్ల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాధికులని చెబుతూ.. ప్రభుత్వ బడుల పట్ల పిల్లల్లో విశ్వాసం కల్పించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా శాఖలో సమస్యలు పేరుకుపోయాయి. పదేళ్లపాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు రాలేదు. బదిలీలు జరగలేదు. ఏడేళ్లపాటు టీచర్ల నియామకాలు జరగలేదు. 2017లో ఒక నోటిఫికేషన్‌ వచ్చింది.

2.jpg


ఆ తర్వాత మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేశాం. ధనిక రాష్ట్రమని చెప్పిన గత పాలకులు డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలను కూడా పెంచలేదు. వాటిని కూడా మేమే పెంచాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో శుభ్రతకు రూ.130 కోట్లు మంజూరు చేశాం. విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశాం. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ప్రభుత్వ బడుల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశించారు’’ అని వివరించారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల కంటే నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిన పూనుదామని పిలుపునిచ్చారు. ఏటా 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేయించనున్నట్టు తెలిపారు. గత పాలకులు మెరుగైన వసతులు కల్పించలేదని, సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. ‘‘గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు కొంతమంది ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకున్నారు. విద్యను వ్యాపారంగా, లాభసాటి వనరుగా మార్చుకున్నారు. విద్యపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నించారు. వర్సిటీల్లో ప్రొఫెసర్ల వయసును పెంచే ఆలోచన కూడా చేయలేదు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చింది. కాకతీయ వర్సిటీ కాలగర్భంలో కలిసే పరిస్థితికి తెచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికే విద్య శాఖను నా దగ్గరే ఉంచుకున్నాను’’ అని వివరించారు. గడిచిన పదేళ్లలో గురు పూజోత్సవం నిర్వహించారా!? చేస్తే ఆ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు అవసరమని చెప్పేందుకే తాను వచ్చానన్నారు.


కేజ్రీవాల్‌ రెండోసారి సీఎం అయ్యారంటే విద్యాభివృద్ధే కారణం

ఢిల్లీలో కేజ్రీవాల్‌ రెండోసారి, మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి అక్కడ ఆయన విద్యలో తీసుకొచ్చిన మార్పులే కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. ఈ విషయంలో తనకు కొంత స్వార్థం ఉందని, ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే తాను కూడా రెండోసారి సీఎం అయ్యే అవకాశం వస్తుందంటూ రేవంత్‌ నవ్వులు పూయించారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతోపాటు తాను కూడా కష్టపడతానని, అందుకు తాను ఏం చేయాలో చెబితే కచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని, వారికి తగిన ఉద్యోగాలు రావడం లేదని, ఈ సమస్యను అధిగమించడానికే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, సమీకృత గురుకులాలను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఐటీఐల్లో 1956 నాటి డీజిల్‌ మెకానిక్‌ పాఠాలనే ఇప్పటికీ బోధిస్తున్నారని, అందుకే, టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లుగా వాటిని మార్చామని వివరించారు. చదువుతోనే కాకుండా క్రీడల్లోనూ భవిష్యత్తు ఉంటుందని, పిల్లలకు ఏ విభాగంలో ఆసక్తి ఉందో గుర్తించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువుకునే సమయంలో తన టీచర్లు పాఠాలు చెప్పిన విధానంతోపాటు వారి దగ్గరి నుంచి నీతి, నిజాయితీ, సద్గుణాలు, సమయపాలన నేర్చుకున్నానని విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. తాను ఇవ్వాళ కార్యదర్శి హోదాలో ఉండడానికి తనకు పాఠాలు చెప్పిన రవీంద్రన్‌ అనే టీచరే కారణమని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


పిల్లలతో మాటామంతీ.. ఉపాధ్యాయులతో సహపంక్తి

గురు పూజోత్సవం సందర్భంగా వేదిక దగ్గర విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌ సందర్శించారు. ఆ సమయంలో పిల్లలతో ఆసక్తిగా మాట్లాడారు. వారు తయారు చేసిన వాటి గురించి ప్రత్యేకంగా అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

కెమెరా ప్రదానం చేసిన మెమెంటో

శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కెమెరా అందరినీ ఆకర్షించింది. ‘గురు పూజోత్సవం’ మెమెంటోను సీఎం రేవంత్‌ అందించినట్టుగా దాని నుంచి ఫొటోలు రావడం విశేషం. వేదిక వద్ద ఓ కెమెరాను ఏర్పాటు చేశారు. దాని ఎదురుగా బహుమతి తీసుకుంటున్నట్టు నిలబడితే చాలు.. సెకన్లలోనే సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నట్టు ఫొటో వచ్చేస్తోంది. దాంతో, అక్కడికి వచ్చిన వారంతా ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.

పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం చేయాలి. నేను కూడా వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేస్తా. అప్పుడే పిల్లలకు అందించే భోజనం విషయంలో తప్పులు జరగకుండా ఉంటాయి

పేదలు చదువుకున్నప్పుడే రాష్ట్రం

తలరాత మారుతుంది. వారి బాధ్యత టీచర్లపైనే ఉంది. దేశ, తెలంగాణ భవిష్యత్తు

తరగతి గదుల్లోనే ఉంది. దానిని మీ చేతుల్లో పెడుతున్నా. మీరు, నేను కలిసి

బలమైన తెలంగాణను పునర్నిర్మిద్ధాం

- సీఎం రేవంత్‌


ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 05:52 AM