BRS: బీఆర్ఎస్ నేతల సంచలన కామెంట్స్.. రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:49 PM
తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టుగా మారి, ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు.
- ఏపీకి నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారు
- కాళేశ్వరంపై సమగ్ర సమాచారం ప్రజలకు తెలపాలి
- ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షం
- మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్
వరంగల్: తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టుగా మారి, ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారని బీఆర్‌ఎస్(BRS) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కుట్రపూరితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్‌ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దమ్మూ, ధైర్యం ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఘోష్ కమిషన్ ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమేనని, కమిషన్‌కు రాజ్యాంగబద్ధత లేదని, కోర్టు తీర్పు కాదని తెలిపారు. కాళేశ్వరంపై సమగ్ర సమచారం ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగితే సరిచేయకుండా మొత్తం ప్రాజెక్టునే బద్నాం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసమే జీవించే నేత కేసీఆర్ రైతాంగం మేలు కోరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం వేదికగా ప్రజా గొంతుకలను ప్రజాస్వామ్య వాదులను ఏకం చేసి కాళేశ్వరం ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, సంకు నర్సింగరావు, బీఆర్‌ఎస్ నాయకులు జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్, హరి రమాదేవి, నయీమొద్దీన్, జానకీ రాములు, వినిల్‌రావు, దేవమ్మ, తస్లీమా, ఇస్మాయిల్, ఖలీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News