Share News

LIC Agent Cheats: దొంగ డెత్‌సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

ABN , Publish Date - Aug 07 , 2025 | 06:08 AM

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఎల్‌ఐసీ ఏజెంట్‌.. ఏలూరు జిల్లా కుక్కునూరుకి చెందిన

LIC Agent Cheats: దొంగ డెత్‌సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

  • భద్రాద్రి కొత్తగూడెంలో మోసానికి పాల్పడిన ఏజెంట్‌

  • పాలసీదారుడికి తెలియకుండానే అతడి పేరిట బీమా

  • ఆ వ్యక్తి బతికే ఉన్నా.. అతని పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టి

  • అతడితో కుమ్మక్కై నగదు డ్రా.. పంపకాల్లో తేడాతో గుట్టురట్టు

కుక్కునూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఎల్‌ఐసీ ఏజెంట్‌.. ఏలూరు జిల్లా కుక్కునూరుకి చెందిన వ్యక్తి డెత్‌ సర్టిఫికెట్‌తో బీమా సొమ్ము స్వాహా చేశాడు. తొలుత ఆ వ్యక్తికి తెలియకుండా, అతడి పేరిట ప్రీమియం కడుతూ.. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తర్వాత అతడితో స్నేహం చేసి, ఓ కట్టుకథ అల్లి, అతడి పేరిట డెత్‌ సరిఫికెట్‌ సంపాదించాడు. దాంతో సొమ్ము డ్రాచేశారు. చివరికి పంపకాల్లో తేడా రావడంతో గుట్టు రట్టయి.. సదరు ఎల్‌ఐసీ సంస్థ ఆ సొమ్మును రికవరీ చేయడంతో పాటు భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలివీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గ్గంపాడు మండలానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ యాకూద్‌ బాషా 2017లో అదే మండలంలోని సారపాక గ్రామం భాస్కర్‌నగర్‌ వీధికి చెందిన భూక్యా శ్రీరాములు పేరున అతడికి తెలియకుండానే ఎల్‌ఐసీ పాలసీ కట్టాడు. అప్పటి నుంచి యాకూద్‌ బాషాయే ప్రీమియం చెల్లించుకుంటూ, తెలివిగా శ్రీరాములుతో స్నేహం చేశాడు. 2024 జూన్‌లో శ్రీరాములు వద్దకు వెళ్లి ‘నీ పేరు గల వ్యక్తి ఆంధ్రాలోని కుక్కునూరు మండలంలో ఉన్నాడని, అతడు ఇటీవల మృతి చెందాడని అతడి పేరుపై ఎల్‌ఐసీ పాలసీ ఉందని, సహకరిస్తే రూ.10 లక్షలు వస్తాయ’ని నమ్మించాడు. మరో వ్యక్తితో కలిసి యాకూద్‌ ఈ పథకాన్ని అమలు చేశాడు. కుక్కునూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి శ్రీరాములు మృతి చెందినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ సంపాదించాడు. దాని ఆధారంగా క్లెయిమ్‌ చేయడంతో శ్రీరాములు భార్య ఖాతాలో రూ.10లక్షల బీమా పరిహారం జమ అయింది. డబ్బులు డ్రా చేసి శ్రీరాములు వాటాగా రూ.3లక్షలు ఇచ్చి మిగిలిన సొమ్మును ఎల్‌ఐసీ ఏజెంట్‌ యాకూద్‌ బాషా తీసుకున్నాడు. అనంతరం మూడో వ్యక్తితో పంపకాల్లో తేడా రావడంతో, అతడు ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. దీంతో ఎల్‌ఐసీ అధికారులు వారి నుంచి సొమ్మును రికవరి చేసి భద్రాచలం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సూత్రధారి యాకూద్‌బాషాతోపాటు కుక్కునూరు పంచాయతీ నుంచి జారీ అయిన సర్టిఫికెట్‌పై కొందరిని భద్రాచలం పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Aug 07 , 2025 | 06:08 AM