Brahmanandam Autobiography: 'నేను మీ బ్రహ్మానందం' పుస్తకావిష్కరణ..
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:54 PM
'నేను మీ బ్రహ్మానందం' అనే పుస్తకాన్ని ఆంగ్లం, హిందీ భాషల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకం ఇప్పటికే ఆరు భాషల్లో ప్రచురణలో ఉంది.
ఢిల్లీ: తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన వజ్రం హాస్యనటుడు బ్రహ్మానందం. తెలుగు చిత్రాల్లోనే కాకుండా అనేక విభిన్న భాషా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని వ్యక్తిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతోమందికి మార్గదర్శకం. అయితే.. బ్రహ్మానందం తాజాగా.. 'నేను మీ బ్రహ్మానందం' అనే ఆత్మకథ రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో 'నేను మీ బ్రహ్మానందం' అనే పుస్తకాన్ని ఆంగ్లం, హిందీ భాషల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. 30 ఏళ్ల సినీప్రస్థానంలో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించిన హాస్యరాజు బ్రహ్మానందం అని వెంకయ్య నాయుడు కొనియాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గొప్పనటుడని ప్రశంసించారు. పాకపాకలు షో ద్వారా బ్రహ్మానందం సినీరంగంలోకి అడుగుపెట్టారని గుర్తు చేశారు.
సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చి శిఖరాగ్ర స్థానానికి చేరుకున్న ఆయన ప్రస్థానం ఒక ప్రభంజనమని కొనియాడారు. ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఉన్న పాఠకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే బ్రహ్మానందం.. మానవతా విలువలకు ప్రతీకని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకం ఇప్పటికే ఆరు భాషల్లో ప్రచురణలో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్