Political Strategy: టార్గెట్ తెలంగాణ!
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:15 AM
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ..
తాజా పరిణామాల్ని అనుకూలంగా మల్చుకొనే దిశగా బీజేపీ అధిష్ఠానం
బీఆర్‌ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం
10, 11 తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ.. పార్టీ బలోపేతానికి వ్యూహరచన
ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం.. బీఆర్‌ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన
ఢిల్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మొదలుకానున్న రాజకీయ కార్యాచరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ.. తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. బీఆర్‌ఎ్‌సలో ప్రజా బలం ఉన్న నాయకులను చేర్చుకోవడమే కాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల తొమ్మిదిన ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పార్టీ అగ్ర నేతలు.. 10, 11 తేదీల్లో రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతోపాటు ఇతర సీనియర్ నాయకులూ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌లో తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాన్ని రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించిన విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో బీఆర్‌ఎ్‌సను బలహీనపరిచేందుకు తగిన అవకాశం లభించిందని, బీఆర్‌ఎస్ బలహీనపడితే బీజేపీ పుంజుకునేందుకు పూర్తి అవకాశాలున్నాయని పార్టీ అగ్ర నేతలు యోచిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర కమిటీని నియమించి, తెలంగాణలో రాజకీయ కార్యాచరణను పూర్తిగా ఢిల్లీ కనుసన్నల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు. పార్టీ ఎంపీలకు, ప్రజా ప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పజెప్పడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. అలాగే, ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని, బీఆర్‌ఎస్‌లో ప్రజా బలం ఉన్న నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అంతేనా.. రాష్ట్రంలో బీజేపీ ఒకరిద్దరు నేతల కనుసన్నల్లోనే నడుస్తోందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యమైన నేతలను విస్మరిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో అన్ని వర్గాల నేతలకూ ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ నేతలు యోచిస్తున్నారు. ఆ తర్వాత బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఏర్పాటు చేసి సమష్టి కార్యాచరణకు వీలు కల్పించాలని భావిస్తున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. దక్షిణాదిన తెలంగాణ తమకు ముఖ్యమైన రాష్ట్రమని, అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడ తమకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కాగా కర్ణాటకలో నవంబరులో బీజేపీకి అనుకూలంగా కీలక పరిణామాలు జరగవచ్చని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News