Share News

BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

ABN , Publish Date - May 02 , 2025 | 05:12 AM

తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ముస్లింలలోని 10 శాతం మందిని బీసీలుగా చూపడం బీసీలకు అన్యాయమన్నారు.

 BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

  • ముస్లింలను బీసీలుగా చూపి, తీవ్ర అన్యాయం చేసిన రేవంత్‌ సర్కారు

  • బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం

  • తొలుత కులగణన చేసింది బిహార్‌లోని ఎన్డీయే సర్కారు: బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. 12 శాతం ముస్లింలలో 10 శాతం మందిని ఓబీసీలుగా చూపి, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. అంబేడ్కర్‌ సిఫారసు చేసిన బీసీ కమిషన్‌ను కాంగ్రెస్‌ గతంలో పార్లమెంట్‌లో చర్చకు తీసుకురాలేదన్నారు. నెహ్రూ నుంచి రాజీవ్‌ వరకు కాంగ్రెస్‌ నేతలంతా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమేని లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చివరిసారిగా 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం కులగణన చేసిందని, 94 ఏళ్ల తర్వాత మోదీ మళ్లీ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కులగణన విషయంలో తెలంగాణ రోల్‌ మోడల్‌ అంటూ రాహుల్‌, రేవంత్‌ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొలిసారిగా ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌లో కులగణన చేపట్టిందని, ఆ నివేదికను అసెంబ్లీలో చట్టరూపం దాల్చేలా చేసిందని లక్ష్మణ్‌ చెప్పారు. తెలంగాణలో ఇటీవల చేసిన కులగణన వివరాలను ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 51 శాతం బీసీలున్నారని గతంలో పేర్కొనగా.. కాంగ్రెస్‌ కులగణనలో 46 శాతంగా చూపించి బీసీలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే దేశం ముక్కలవుతుందని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ దెబ్బతిటుందని అప్పట్లో నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని గుర్తుచేశారు.


మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బీసీల అభ్యున్నతి కోసం మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ, జనతా ప్రభుత్వం పడిపోవడం వల్ల ఆ కమిషన్‌ మరుగునపడిందన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసినా మండల్‌ కమిషన్‌ ఊసే ఎత్తలేదని విమర్శించారు. 1990లో వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తే, ప్రతిపక్ష నేతగా ఉన్న రాజీవ్‌ గాంధీ వాటికి వ్యతిరేకంగా మాట్లాడి, ప్రధానిని కుల నాయకుడిగా అభివర్ణించారని లక్ష్మణ్‌ తెలిపారు. 2010లో యూపీఏ ప్రభుత్వం రూ.5000 కోట్ల ఖర్చుతో ప్రైవేట్‌ ఏజెన్సీలతో సర్వే చేపట్టి, వివరాలను బహిర్గతం చేయలేదని విమర్శించారు. భవిష్యత్తులో జనగణనతో పాటే కులగణన కూడా జరుగుతుందని 2018లోనే రాజ్‌నాఽథ్‌ సింగ్‌ స్పష్టం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా రాహుల్‌ ఏనాడూ స్పందించలేదని చెప్పారు.


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:14 AM