Share News

Tops Richest Chief Minister: బిలియనీర్‌ చంద్రబాబు

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:47 AM

దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. రూ.332 కోట్లకుపైగా ఆస్తులతో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో..

Tops Richest Chief Minister: బిలియనీర్‌ చంద్రబాబు

  • అత్యంత సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానం

  • కుటుంబ ఆస్తులు 931 కోట్లు.. 10 కోట్ల అప్పులు

  • రూ.30 కోట్ల ఆస్తులతో ఏడో స్థానంలో రేవంత్‌ రెడ్డి

  • రూ.15 లక్షలతో చివరి స్థానంలో మమత.. ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. రూ.332 కోట్లకుపైగా ఆస్తులతో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో, రూ.51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రూ.15 లక్షలకుపైగా ఆస్తితో ఈ జాబితాలో చివరిస్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు రూ.54.42 కోట్లు. వీరి ఆస్తుల మొత్తం రూ.1,632 కోట్లు. వీరిలో ఇద్దరు మాత్రమే బిలియనీర్లు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.30 కోట్ల ఆస్తి, రూ.కోటి అప్పు ఉండటం గమనార్హం. సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు రూ.55 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్‌కు రూ.కోటి ఆస్తి ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఇక అప్పుల విషయానికి వస్తే పెమా ఖండుకు రూ.180 కోట్లు, సిద్దరామయ్యకు రూ.23 కోట్లు, చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నాయి.

హెరిటేజ్‌ వాటాలే బాబు సంపదగా పరిగణన...

చంద్రబాబుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లో ఎలాంటి షేర్లూ లేనప్పటికీ, 1992లో కేవలం రూ.7,000 పెయిడ్‌ క్యాపిటల్‌, రూ.కోటి ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌తో స్థాపించిన ఈ సంస్థలో ఆయన భార్య నారా భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది. ఈ వాటాను ఏపీ సీఎం సంపదగా పరిగణించారు. నారా కుటుంబానికి (ప్రమోటర్లు) హెరిటేజ్‌ ఫుడ్స్‌లో మొత్తం 41.3 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1995లో రూ.25 కోట్ల నుంచి తాజాగా రూ.4,381 కోట్లకు (శుక్రవారం బీఎ్‌సఈలో షేర్ల ముగింపు ధర ప్రకారం) పెరిగింది.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:47 AM