Sudershan Reddy: అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:56 PM
డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని బి సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్యనే పోటీ అని చెప్పారు.
న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాదం బలపడటానికి సల్వా జుడుంపై సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు కారణమంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, 'ఇండియా' ఉప రాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి (B Sudershan Reddy) శుక్రవారంనాడు స్పందించారు. తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని, తాను వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పుకాదని ఆయన వివరణ ఇచ్చారు. డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగానే చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అమిత్‌షా ఏమన్నారంటే..
'ఇండియా' కూటమి అభ్యర్థిని ఉద్దేశించి అమిత్‌షా శుక్రవారంనాడు కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రెడ్డి ఇచ్చిన సల్వాజుడం తీర్పుతో వామపక్ష తీవ్రవాదం బలపడిందని ఆరోపించారు. నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్‌రెడ్డిని విపక్ష 'ఇండియా' కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సల్వా జుడుం' చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదన్నారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసిందని ఆరోపించారు.
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను నిలబెట్టింది. ఇందుకు ప్రతిగా 'ఇండియా' కూటమి బి.సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఇప్పుడు ముఖాముఖీ పోరు నెలకొంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మా ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. ట్రంప్ ఆంక్షలపై జైశంకర్
ఆ బిల్లు ఓ ప్రహసనం, జేపీసీకి సభ్యుడిని నామినేట్ చేయం.. మమత ఫైర్
For More National News And Telugu News