Mamata Banerjee: ఆ బిల్లు ఓ ప్రహసనం, జేపీసీకి సభ్యుడిని నామినేట్ చేయం.. మమత ఫైర్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:48 PM
అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లులపై మమతా బెనర్జీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ బిల్లులతో దేశంలో ప్రజాస్వామ్య శకం ముగిసినట్టేనని, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చరమగీతం పాడినట్టవుతుందని ఆరోపించారు. ఈ బిల్లులతో ప్రధానికి, హోం మంత్రికి అధికారులు వస్తాయని, ఈ చర్య సూపర్-ఎమర్జెన్సీని మించిపోయే చర్య అని అభ్యంతరం తెలిపారు.
కోల్‌కతా: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే కొత్త బిల్లుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మరోసారి విరుచుకుపడింది. ఈ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి తమ పార్టీ సభ్యుడిని నామినేట్ చేసేది లేదని ఆ పార్టీ చీఫ్ , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టే స్టేజ్‌లోనే 130వ రాజ్యంగ సవరణ బిల్లును తాము వ్యతిరేకించామనీ, తమ దృష్టిలో జేపీసీ అనేది ఒక ప్రహసనమని అన్నారు. ఏఐటీసీ నుంచి పార్టీ తరఫున ఎవ్వరినీ నామినేట్ చేయడం లేదని ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత బుధవారంనాడు మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కాన్‌స్టిట్యూషన్ (130వ సవరణ) బిల్లు-2025, గవర్న్‌మెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు-2025, జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను తెస్తోందంటూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కొందరు విపక్ష సభ్యులు ఈ బిల్లుల ప్రతులను చించివేసి అమిత్‌షా వైపు విసిరేశారు. ఈ క్రమంలో బిల్లులను జేపీసీకి పంపుతున్నట్టు అమిత్‌షా ప్రకటించారు.
బిల్లులతో ప్రజాస్వామ శకానికి చరమగీతం
అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లులపై మమతా బెనర్జీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ బిల్లులతో దేశంలో ప్రజాస్వామ్య శకం ముగిసినట్టేనని, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చరమగీతం పాడినట్టవుతుందని ఆరోపించారు. ఈ బిల్లులతో ప్రధానికి, హోం మంత్రికి అధికారులు వస్తాయని, ఈ చర్య సూపర్-ఎమర్జెన్సీని మించిపోయే చర్య అని అభ్యంతరం తెలిపారు. ఈ క్రూరమైన బిల్లులతో భారతదేశ ప్రజస్వామ్యం, సమాఖ్య వ్యవస్థకు ఘోరీ కట్టినట్టమవుతుందని, ప్రతిపాదిత 130వ రాజ్యాంగ సవరణ బిల్లును టీఎంసీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తోందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మా ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. ట్రంప్ ఆంక్షలపై జైశంకర్
2035 నాటికి ఇండియాకు సొంత స్పేస్ స్టేషన్.. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్
For More National News And Telugu News