Share News

BC reservation: బీసీ కోటాపై కమిటీ

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:47 AM

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ నిర్ణయించింది. ..

BC reservation: బీసీ కోటాపై కమిటీ

ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే..

  • మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్కలతో ఏర్పాటు

  • టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం

  • బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 26 కల్లా సర్కారుకు నివేదిక

  • 27న ఆ నివేదిక డెడికేషన్‌ కమిటీ ముందుకు 29న క్యాబినెట్‌లో చర్చించి, స్థానిక ఎన్నికలపై నిర్ణయం

  • ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజారిటీ సభ్యులు

  • బీసీలకు మేలు జరగాలన్న సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని తీర్మానించింది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరిపేందుకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్కలతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్‌కు తోడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే.. మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరతాయి. ఈ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణుల నుంచి కమిటీ అభిప్రాయాలు తీసుకోనుంది. కులగణన సర్వేపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకోనుంది. వీటన్నింటితో కూడిన నివేదికను ఈ నెల 26 కల్లా ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను ప్రభుత్వం డెడికేటెడ్‌ కమిషన్‌కు ఇవ్వనుంది. కమిషన్‌ దానిపై అధ్యయనం చేసి.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచన చేయనుంది. ఈ నెల 29న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశమై కమిషన్‌ సూచన ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన పీఏసీ, టీపీసీసీ సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌, మంత్రులు, పీఏసీ, సలహా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

jcbl.jpg


బీసీ బిల్లులపై లాయర్లను నియమించాం

విద్య, ఉద్యోగాలు.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులూ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదన వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వి, నిరంజన్‌రెడ్డిలను నియమించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాలు పంపిన బిల్లులను రాష్ట్రపతి 90 రోజుల్లో పరిష్కరించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలన్న అంశం పీఏసీలో చర్చకు వచ్చింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించడానికి ఇద్దరు న్యాయవాదులను నియమించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిప్రాయం చెప్పే క్రమంలోనే రాష్ట్రపతి వద్ద ఉన్న బీసీ బిల్లుల అంశాన్నీ ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పిటిషన్‌ వేస్తే కేసు లిస్ట్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే అంశంలో ప్రభుత్వం ముందున్న మూడు ప్రత్యామ్నాయాలను పీఏసీ సభ్యులకు సీఎం వివరించారు. రాహుల్‌గాంధీ, పార్టీ ఆదేశం మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టి.. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్‌ చట్టం తీసుకొస్తే, అడ్డంకిని తొలగించడానికి పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ ఆర్డినెన్సును తీసుకువచ్చామని తెలిపారు. కేసీఆర్‌ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్‌ కూడా పెరగదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రేవంత్‌ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు మేలు జరగాల్సిందేనన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ జీవో తీసుకురావడం ఒకటి కాగా.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబరు 30లోగా ఎన్నికలకు వెళ్లడం రెండోదని చెప్పారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను ఆమోదించుకోవడం కోసం న్యాయపోరాటం చేయడం, కేంద్రంపై ఒత్తిడి తేవడం మూడో ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈ మూడు అంశాలను పీఏసీలో చర్చకు పెట్టారు. వీటిపై సభ్యులు విస్తృతంగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి మంచి వాతావరణం ఉందని, వెంటనే స్థానిక ఎన్నికలకు వెళ్లడం మేలని 90 శాతానికి పైగా సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చట్ట పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ నేత వి.హన్మంతరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ తదితరులు వినిపించారు. అందరి అభిప్రాయాలనూ పరిగనణనలోకి తీసుకున్న పీఏసీ.. న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకోసం మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది.


జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వండి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి.. తెలుగువాడైన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీలూ మద్దతు తెలిపి గెలిపించాలని కోరుతూ పీఏసీ తీర్మానించింది. తెలంగాణకు చెందిన ప్రజాస్వామ్య వాది, రాజ్యాంగ నిపుణుడు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఇండి కూటమి తరఫున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ హర్షం వ్యక్తం చేసింది.

యూరియాపై బీఆర్‌ఎస్‌, బీజేపీ డ్రామా

రాజ్యాంగ పరిరక్షణతోపాటు పౌర హక్కులను కాపాడడం కోసం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పని చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్‌ అనడంతోనే వారి వైఖరి ఏంటో అర్థమవుతోందని చెప్పారు. యూరియాపై బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులను కలిశానన్నారు. యూరియా పంపిణీపైక్షేత్రస్థాయిలో పర్యవేక్షణను విస్తృతం చేయాలని పేర్కొన్నారు.


26న బిహార్‌కు సీఎం, మంత్రులు: భట్టి

ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బిహార్‌లో చేపట్టిన పాదయాత్రలో ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, ఇతర ముఖ్యనాయకులు హాజరు కావాలని పీఏసీ భేటీలో నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. పీఏసీ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల పీఏసీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తీర్మానించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆదివారం సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.

ఓట్‌ చోరీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మహేశ్‌గౌడ్‌

ఓట్‌ చోరీతోనే బీజేపీ మూడోసారి గెలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. రాహుల్‌గాంధీ ఈ అంశంపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి, ఉద్యమాన్ని చేపట్టారని చెప్పారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీఏసీ సభ్యులకు సూచించారు. రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, రైతు భరోసా, రుణమాఫీ, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం లాంటి కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. కాగా, ఓట్‌ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌, మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పీఏసీ సభ్యులతో కలిసి సీఎం ఈ లోగోను విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:47 AM