Share News

Bandi Sanjay: ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:34 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్‌ను నిరంతరం ట్యాప్‌ చేశారని ఆరోపించారు.

Bandi Sanjay: ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

  • నేరుగా సీబీఐ విచారించి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం

  • నా ఫోన్‌ నిరంతరం ట్యాప్‌

  • రేవంత్‌, హరీశ్‌ ఫోన్లూ వదల్లేదు

  • 6500 ఫోన్లు ట్యాప్‌ చేశారు!

  • సిట్‌ విచారణ అనంతరం మీడియాతో బండి సంజయ్‌

  • లీగల్‌ నోటీసులిస్తాననడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని వ్యాఖ్య

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్‌ను నిరంతరం ట్యాప్‌ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) వెల్లడించిన విషయాలు దిగ్ర్భాంతికి గురిచేశాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం 6500 మంది ఫోన్లు ట్యాప్‌ చేసిందని, తనతోపాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నాటి మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాప్‌ చేశారని చెప్పారు. కేసీఆర్‌ కూతురు కవిత, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించకుంటే ఇప్పుడు జరిగేదంతా తూతూ మంత్రమేనని.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జరిగిన ఒప్పందమేనని భావించాల్సి ఉంటుందని సంజయ్‌ చెప్పారు. రాష్ట్రంలో సీబీఐ నేరుగా విచారణ జరిపే అవకాశం ఉంటే ఈ పాటికి కేసీఆర్‌, ఆయన కొడుకును జైల్లో వేసేవాళ్లమని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సీబీఐ నేరుగా విచారణ జరిపే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. కాబట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. శుక్రవారం దిల్‌కుశ్‌ అతిథి గృహంలో సిట్‌ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌ను అడ్డుపెట్టుకుని ప్రభాకర్‌రావు బృందం కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుందని, ఆ మొత్తం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌ పరిధి ఎంత అని ఆయన ప్రశ్నించారు. నాటి ఎస్‌ఐబీ అధికారులు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారనడానికి ఆధారాలున్నాయని, వారిని సిట్‌ పిలిచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తుందా? సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందా? అని సంజయ్‌ ప్రశ్నించారు. డబ్బుల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈడీకి లేఖ రాస్తే తక్షణమే విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ కేసు విచారించిన జడ్జి ఫోన్లను సైతం కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని ఆరోపించారు. మావోయిస్టుల పేర్లు చెప్పి తనతోపాటు రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని సంజయ్‌ వెల్లడించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, సంతోష్‌ మినహా బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లన్నీ ట్యాప్‌ అయ్యాయని చెప్పారు. ట్యాపింగ్‌ కేసులో రేవంత్‌రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ తానా అంటే రేవంత్‌ తందానా అంటున్నారని.. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారులను అరెస్ట్‌ చేయడం లేదని చెప్పారు. సీఎం కూడా వెంటనే సిట్‌ విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాటి సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు ట్విటర్‌ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్‌కు ఉందా? అని నిలదీశారు. సిట్‌ విచారణ పేరుతో జరుగుతున్న డ్రామాలు ఆపాలని, సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం వావివరసలు మర్చిపోయి ఫోన్లు ట్యాప్‌ చేసిందన్నారు. తన ఫోన్లతోపాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్‌, పని వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని.. ఇలాంటి నీచులను ఏమనాలో తెలియడం లేదని సంజయ్‌ అన్నారు. ‘కేసీఆర్‌ పాలనలో అందరూ వాట్సాప్‌ కాల్‌ మాత్రమే మాట్లాడుకునే వాళ్లు. చివరకు బిచ్చమెత్తుకునే వాళ్లు కూడా మామూలు కాల్‌ మాట్లాడే వారు కాదంటే బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంతటి ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి తన దగ్గరున్న సమాచారం, ఆధారాలన్నీ సిట్‌కు అందించానని చెప్పారు.


వాళ్లకు ఉరిశిక్ష వేసినా సరిపోదు..

మావోయిస్టు, టెర్రరిస్టుల కార్యకలాపాలను తెలుసుకుని, నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఎస్‌ఐబీని అడ్డుపెట్టుకుని కేసీఆర్‌, ఆయన కొడుకు కలిసి రాజకీయ నాయకులందరి ఫోన్లను ట్యాప్‌ చేశారని సంజయ్‌ చెప్పారు. ఎస్‌ఐబీ అడ్డాగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినిమావాళ్లు, ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు. గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌కు సంబంధించి ఆందోళన కార్యక్రమం గురించి ఫోన్లో మాట్లాడుకుంటే.. ట్యాప్‌ చేసి విన్న పోలీసులు తన ఇంటికొచ్చి అడ్డుకున్నారని తెలిపారు. గ్రూప్‌-1 కేసును విచారించిన జడ్జి ఫోన్‌నూ ట్యాప్‌ చేశారని, దీన్నిబట్టే కేసీఆర్‌ ఎంతటి నీచానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చని సంజయ్‌ అన్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుకు ఉరిశిక్ష సరిపోదని చెప్పారు. చేసిన పాపాలు తలుచుకొని కుళ్లికుళ్లి ఏడ్చేలా శిక్ష విధించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


పట్టుకున్న డబ్బులేమయ్యాయి?

రాజకీయ నాయకులే కాదు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వద్ద రూ.7 కోట్లు పట్టుకున్నారని.. మరికొందరు కాంగ్రెస్‌ నేతల వద్ద వందల కోట్ల రూపాయలు పట్టుకున్నారని చెప్పారు. ట్యాపింగ్‌తో రూ.20 కోట్లు పట్టుకుంటే అందులో రూ.18 కోట్లు తినేసి.. విచారణలో రూ.2 కోట్లే చూపేవాళ్లని విమర్శించారు. ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియదని, దర్యాప్తులో ఈ విషయాన్ని తేల్చాలని అన్నారు. ఆ పైసలన్నీ ట్యాపింగ్‌ ముఠా తినేసిందా? ట్విటర్‌ టిల్లు తిన్నాడా? అన్నది తేల్చాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌, ప్రభాకర్‌రావు చేసిన వసూళ్లపై విచారణ జరపాలన్నారు.

కేసీఆర్‌ కుటుంబ అవినీతి కాంగ్రె్‌సకు ఏటీఎం..

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంలా మారిందో కేసీఆర్‌ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలాగే మారిందని సంజయ్‌ ఆరోపించారు. ఒక్కొక్క కుంభకోణానికి ఢిల్లీలో రేటు కుదురుతుందని, అన్ని కేసుల్లోనూ మూటలు అప్పజెబుతున్నారని చెప్పారు. ఇక్కడ విచారణ చేస్తామంటూ కమిషన్‌లు ఏర్పాటు చేస్తున్నారని.. విచారణ పూర్తి కాకముందే కేసీఆర్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్ని కలిసి వందల కోట్లు అప్పజెబుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు రేవంత్‌ క్లీన్‌ చిట్‌..

ఫోన్‌ ట్యాపింగ్‌ అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే.. ఆ సొమ్ములో వాటా కోసమే రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని సంజయ్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి కేసీఆర్‌ చెప్పిందే రేవంత్‌రెడ్డి చెబుతున్నారని.. కేసీఆర్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఆయనను అరెస్ట్‌ చేయబోమని చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని.. విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్‌ కుటుంబంపై ఏ చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు కాబట్టే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో లీగల్‌ సెల్‌ నాయకులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తలేరా? అని మాట్లాడుతున్నారని.. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ, కూటమి పాలన కొనసాగుతోందని, ఈ విషయంపై అక్కడి ప్రతిపక్షాలు చిన్న ఆరోపణ కూడా చేయలేదని గుర్తుచేశారు.


లీగల్‌ నోటీసులిచ్చేందుకు కేటీఆర్‌కు సిగ్గుండాలి: సంజయ్‌

అనైతిక పనులు చేస్తూ లీగల్‌ నోటీసులు ఇస్తానంటున్నందుకు ట్విట్టర్‌ టిల్లుకు సిగ్గుండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ ఓ పిరికిపంద అని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను 48 గంటల్లోగా వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్‌ చేసిన హెచ్చరికపై సంజయ్‌ స్పందించారు. లీగల్‌ నోటీసులు ఇస్తానని గతంలో కూడా బెదిరించి పారిపోయారని సంజయ్‌ ఎక్స్‌ వేదికగా గుర్తుచేశారు.

అతిథి గృహం వరకు ర్యాలీ.. ట్రాఫిక్‌ జామ్‌

సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నివాసం నుంచి ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో ఉన్న హనుమాన్‌ ఆలయం వరకు కాన్వాయ్‌తో వచ్చిన ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఖైరతాబాద్‌ చౌరస్తా, రాజ్‌భవన్‌ రహదారి మీదుగా వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా దిల్‌కుశ్‌ అతిథి గృహం వరకు వెళ్లారు. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, తాజ్‌కృష్ణ రహదారి, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, లకడీకాపూల్‌ మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంజయ్‌ బయటికి వచ్చినప్పుడు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 04:34 AM