Phone Tapping: అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:09 PM
తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్ అయినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన ఫోన్, తన కుటుంబ సభ్యులతోపాటు తన ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారు.
హైదరాబాద్, ఆగస్ట్ 08: తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్ అయినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన ఫోన్, తన కుటుంబ సభ్యులతోపాటు తన ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు తాను గుర్తించానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు.
అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్లు ఎక్కువ సార్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్ ట్యాప్ చేశారని వివరించారు.
టీబీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన చుట్టూ నిఘా పెట్టారని విమర్శించారు. వావివరసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బంది ఫోన్లూ సైతం ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని గుర్తు చేశారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస చీఫ్ కేసీఆర్ పాత్ర ఉందని కుండ బద్దలు కొట్టారు. కేసీఆర్ పాలనలో సామాన్యులు సైతం ఫోన్లు మాట్లాడ లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భార్యాభర్తల ఫోన్ సంభాషణలూ కూడా విన్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫ్యోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. గతంలో ఖమ్మం ఎంపీ దగ్గర పట్టుబడిన రూ.7 కోట్లు ఏమయ్యాయి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రెండు గంటలపాటు విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో అధికారుల విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు బండి సంజయ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షిగా బండి సంజయ్ అందించిన వాంగ్మూలాన్ని వారు రికార్డు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులు, ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు.
డేటా అందించిన సిట్ అధికారులు..
తెలంగాణ బీజేపీ చీఫ్ అయినప్పటి నుంచి మీ ఫోన్ ట్యాప్ అయినట్లు బండి సంజయ్‌కు సిట్ అధికారులు వివరించారు. అలాగే ఎవరితో ఎంత సేపు మాట్లాడారన్న డేటాను సైతం ఆయనకు వారు సాక్ష్యాలతో సహా చూపించారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో బండి సంజయ్ మాట్లాడిన డేటాకు సంబంధించిన వివరాలను ఆయనకు సిట్ అధికారులు ఈ సందర్భంగా అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు
టైర్ పంక్చర్ స్కామ్.. రూ.8 వేలు నష్టపోయిన వ్యక్తి, ఎలాగో తెలుసా..
For More Telangana News And Telugu News