Amit Shah Criticized: సుప్రీంకోర్టును అవమానపర్చిన అమిత్ షా
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:08 AM
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ..
జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విమర్శలు సరికాదు: మల్లు రవి
ఆయన ఆదరణను బీజేపీ తట్టుకోలేకపోతోంది: జీవన్‌రెడ్డి
రేవంత్ సర్కారుపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు: చిన్నారెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్/నార్కట్‌పల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సల్వాజుడుంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పును విమర్శించడం.. ఆయన నక్సలిజాన్ని ప్రోత్సహించారనడం.. సుప్రీంకోర్టును అవమానపర్చడమేనని చెప్పారు. శనివారం ఢిల్లీలో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలతో పాటు సుప్రీంకోర్టు ప్రమాణాలను దిగజార్చడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఆదివాసీలను ఆదివాసీలతో హత్య చేయించేందుకు ప్రభుత్వమే ప్రైవేట్ సేనను ప్రోత్సహించడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారని.. చట్ట ప్రకారమే ఆనాడు తీర్పునిచ్చారని చెప్పారు. కాంగ్రెస్ కూడా నక్సలిజాన్ని సమర్థించబోదని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి బెంబేలెత్తిన బీజేపీ నేతలు.. ఆయనపై నక్సల్ సానుభూతిపరుడిగా ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సుదర్శన్‌రెడ్డి.. రాజ్యాంగ విలువలకు కట్టుబడ్డ వ్యక్తి అని, ఆయన అభ్యర్థిత్వం పట్ల హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. సోషలిస్టు భావాలు గల సుదర్శన్‌రెడ్డికి ఇండియా కూటమి పార్టీలతో పాటుగా ఇతర పార్టీల వారూ మద్దతు తెలపాలని కోరారు. రేవంత్ సర్కారును బద్నాం చేసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఈ ఆగస్టు వరకు 8.30 లక్షల టన్నుల యూరియా కేంద్రం నుంచి రావాల్సి ఉండగా... ఇప్పటివరకు 5.36లక్షల టన్నుల యూరియానే వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపారు.
కేసీఆర్‌లో వణుకు: చామల
కాళేశ్వరం పేరు చెబితేనే కేసీఆర్‌లో వణుకు పుడుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. నార్కట్‌పల్లిలో రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చామల మాట్లాడుతూ.. కాళేశ్వర నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడతామంటే.. కేసీఆర్, హరీశ్ కోర్టు కెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News