WPL 2026: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - Dec 23 , 2025 | 06:32 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: జనవరి 7 నుంచి మెగా టోర్నీ మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. మెగ్ లానింగ్ యుగానికి ముగింపు పలుకుతూ.. భారత మహిళల స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది ఆ ఫ్రాంచైజీ.
మెగ్ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలో ఫైనల్స్‌కు చేరింది. కానీ కప్పు అందుకోలేకపోయింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని భారత మహిళా క్రికెటర్లను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగాలని యాజమాన్యం నిర్ణయించింది. అదే ఆలోచనలో భాగంగా 25 ఏళ్ల జెమీమాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
సూపర్ ఫామ్‌లో..
వన్డే ప్రపంచ కప్ 2025 నుంచి తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 వరకు.. జెమీ అద్భుత ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 507 పరుగులు సాధించింది. 139.66 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తూ తన సత్తా చాటింది. జెమిమా, వన్డే ప్రపంచకప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాదింది. అలాగే శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విశాఖపట్నంలో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మరోసారి తన క్లాస్‌ను నిరూపించింది.
సర్‌ప్రైజ్..
కెప్టెన్సీ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రత్యేకంగా తెలియజేసింది. అక్టోబర్‌లో ఫ్యాన్ మీట్ పేరుతో జెమిమాను పిలిచిన ఫ్రాంచైజీ, ఆమెకు తెలియకుండా ఈ నిర్ణయాన్ని సర్‌ప్రైజ్‌గా వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఢిల్లీ ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా జెమిమాకు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, సన్నిహితులు వీడియో సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కోచ్ మాట్లాడుతూ, జెమిమా ఆటతో ప్రేరణ పొందుతూ దేశంలో మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీని అందిస్తూ, కెప్టెన్సీ బాధ్యతలను అధికారికంగా ప్రకటించారు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు