Navjot Singh Sidhu: కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటా: నవ్‌జ్యోత్ సింగ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:13 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లీ టెస్టులకు దూరమయ్యాక.. టీమిండియా ప్రదర్శన అంత మెరుగ్గా అయితే లేదు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై క్లీన్ స్వీప్ అవ్వడమే ఉదాహరణ. అయితే వన్డేల్లో మాత్రం విరాట్.. అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu) ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
‘దేవుడు నాకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే కోహ్లీ(Virat Kohli) తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని అడుగుతా. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే ఆనందాన్ని, పారవశ్యాన్ని ఏదీ ఇవ్వదు! 20 ఏళ్ల యువకుడిలా విరాట్ ఫిట్‌నెస్ ఉంది. అతడు 24 క్యారెట్ల బంగారం’ అని సిద్ధూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విరాట్.. సిడ్నీలో జరిగిన మూడో మ్యాచ్‌లో 74 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు. తర్వాత సఫారీలతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు బాదేశాడు. మొత్తం మీద ఈ ఏడాది 13 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 651 పరుగులు చేశాడు. 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ‘కింగ్’.. ఆంధ్రపై శతకం (131; 101 బంతుల్లో), గుజరాత్‌పై 77 పరుగులు చేశాడు. జనవరి 11 నుంచి కివీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు