Share News

Ind Vs SA: వాళ్లిద్దరి ఫామ్ ఆందోళనకరంగానే ఉంది కానీ..!: టీమిండియా సహాయ కోచ్

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:27 AM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరి ప్రదర్శనపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్‌టెన్ స్పందించాడు. వాళ్లు తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉన్నట్లు తెలిపాడు.

Ind Vs SA: వాళ్లిద్దరి ఫామ్ ఆందోళనకరంగానే ఉంది కానీ..!: టీమిండియా సహాయ కోచ్
Ind Vs SA

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లోనూ పేలవ ప్రదర్శనే కనబర్చారు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్య 5, గిల్ 0 పరుగులకే ఔటయ్యారు. వీరిద్దరి ఫామ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా సహాయ కోచ్ ర్యాన్‌టెన్ డస్కాటే.. కీలక వ్యాఖ్యలు చేశారు.


‘ఆస్ట్రేలియా పర్యటన చివరిలో గిల్ మనస్తత్వంలో మంచి మార్పులే వచ్చాయి. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఔట్ అయిన విధానానికి నేను పెద్దగా ఆందోళన చెందను. ఎందుకంటే తొలి టీ20లో మేమే ఆటగాళ్లను పవర్ ప్లేలో దూకుడుగా ఆడమని చెప్పాం. అయితే కటక్‌లో బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కాదు. కాబట్టి ఆ మ్యాచులో గిల్ ఆట గురించి పెద్దగా మాట్లాడను. ఇక రెండో టీ20 విషయానికొస్తే.. బ్యాటర్ ఫామ్‌లో లేనప్పుడు మంచి బంతులకు కూడా కొన్నిసార్లు అలా జరుగుతుంది’ అని ర్యాన్‌టెన్ అన్నాడు.


ఆ నమ్మకం మాకుంది..

‘గిల్ ఐపీఎల్‌లో దాదాపు 800 పరుగులు చేశాడు. మాకు అతడిపై నమ్మకం ఉంది. సూర్య కుమార్ విషయంలో కూడా అదే దృక్పథంతో ఉన్నాం. కెప్టెన్సీ పాత్రల విషయంలో మా ప్రణాళికలో ఇప్పటికే చాలా దూరం వెళ్లాం. నాణ్యమైన ఆటగాళ్లు, కెప్టెన్లకు మనం మద్దతు ఇవ్వాలి. బయటి నుంచి చూస్తే వాళ్ల పరిస్థితి, ఫామ్ కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తుంది. కానీ వారు తిరిగి పుంజుకుంటారని మాకు ఆ ఇద్దరి విషయంలో పూర్తి విశ్వాసం ఉంది’ అని ర్యాన్‌టెన్ వెల్లడించాడు.


ఇవీ చదవండి:

పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!

Updated Date - Dec 12 , 2025 | 11:27 AM