Ind Vs SA: అదే గంభీర్ చేసిన తప్పు.. ఓటమిపై విమర్శలు గుప్పిస్తున్న మాజీ క్రికెటర్లు
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:30 AM
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పరాభవం ఎదురైందని విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్లేయర్లు విఫలమయ్యారు. ఆదుకుంటారు అనుకున్న అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితం.. సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. తిలక్ వర్మ(62) మినహా ఏ ఇతర బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో ప్రదర్శించలేదు. ఆఖరిలో 5 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఫలితం.. ఘోర పరాభవం. ఈ ఓటమి(Ind Vs SA)పై మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, డేల్ స్టెయిన్ తీవ్రంగా స్పందించారు. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు.
‘భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉండాలి. అక్షర్ పటేల్‌ను వన్ డౌన్‌లో పంపించారు. దూకుడుగా ఆడాల్సిన అక్షర్.. 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అది అస్సలు సరైన పద్ధతి కాదు. టాప్ 3 బ్యాటర్ల స్థానాలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రయోగాలు చేయడం వల్ల జట్టు స్థిరత్వం దెబ్బ తింటుంది’ అని రాబిన్ ఉతప్ప(Robin Uthappa) విశ్లేషించాడు.
‘సూర్య కుమార్ మీ బెస్ట్ బ్యాటర్. అతడిని వెనక్కి నెట్టి అక్షర్‌ను మూడో స్థానంలో పంపడమే గంభీర్ చేసిన పెద్ద తప్పు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి సమయం కాదు. అక్షర్ పటేల్‌కు ఆడే సామర్థ్యం లేదని కాదు కానీ జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో వన్ డౌన్‌లో పంపడం సరికాదు. సింహాల గూటిలో అక్షర్‌ను నెట్టినట్టు అనిపించింది. సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉన్న మ్యాచులో ఇలాంటి ప్రయోగాలు అనవసరం’ అని డేల్ స్టెయిన్(Dale Steyn) వ్యాఖ్యానించాడు.
ఇవీ చదవండి:
ఓటమికి ఆ రెండూ కారణం.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్