Ind Vs SA T20: ఓటమికి ఆ రెండూ కారణం.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:56 AM
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు బ్యాటుతో, ఇటు బంతితో భారత్.. విఫలమైంది. జట్టు ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. బ్యాటుతో, బంతితో విఫలమైన భారత్.. 51 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డికాక్(90) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. 214 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. జట్టు ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు.
‘టాస్ గెలిచి మేం ముందు బ్యాటింగ్ చేయాల్సింది. కానీ బౌలింగ్ ఎంచుకుంది. పొరపాటు అక్కడే జరిగింది. అయినా మేం బాగానే పుంజుకున్నాం. కానీ ముందుగా బౌలింగ్ చేయడం వల్ల ఏ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలనే విషయం సౌతాఫ్రికా బౌలర్లకు బాగా అర్థమైంది. ఇది నేర్చుకునే ప్రక్రియ. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. కొద్దిగా మంచు కూడా ఉంది. మా మొదటి ప్లాన్ విఫలమైంది. కానీ సెకండ్ ప్లాన్‌ను అమలు చేయలేకపోయాం. అయినా పర్వాలేదు. సౌతాఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేం పాఠం నేర్చుకున్నాం’ అని సూర్య వెల్లడించాడు.
మేమిద్దరం మెరుగవ్వాలి..
‘బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, నేనూ కాస్త మెరుగవ్వాలి. మేం జట్టుకి మంచి ఆరంభాన్ని ఇవ్వాలి. ప్రతిసారీ అభిషేర్ శర్మపైనే ఆధారపడటం సరి కాదు. బ్యాటర్లంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. శుభ్‌మన్ తొలి బంతికే ఔటయ్యాడు. కనీసం నేను అయినా ఇంకాస్త ఎక్కువ సేపు క్రీజులో ఉండాల్సింది. మా ఓటమికి ఇదే కారణం. ఈ తప్పిదాలను సరి చేసుకుని తదుపరి మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేస్తాం. గత మ్యాచ్ తరహాలో అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్య రాణిస్తారని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ