Sachin Tendulkar: సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:57 PM
భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదారు. ఆ సందర్భంగా తన సహచరుడికి ఇచ్చిన మాటను 15 ఏళ్ల తర్వాత సచిన్ నిరవేర్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ రంగంలో ఆయన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలవబడుతున్న సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ఎంట్రీకి సాయపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్ నిలబెట్టుకున్నానని సచిన్ తెలిపారు. మరి.. ఆ వ్యక్తి ఎవరు?. సచిన్ ఇచ్చిన మాట ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదారు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టారు. మ్యాచ్ లో సెంచరీ చేయకుండా ఉంటే.. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం ఆలస్యంగా జరిగేది. అయితే గురుశరణ్ సింగ్ త్యాగం కారణంగా సచిన్.. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం త్వరగా జరిగింది. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఇటీవలే స్వయంగా వెల్లడించారు.
1989 ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్ సింగ్ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సచిన్ శతకం బాదే వరకు ఎంతో సహకారం అందించాడు. చివరకు సచిన్ శతకం చేసి.. సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. ఆ సందర్భంలో గురుశరణ్ సింగ్ త్యాగానికి ప్రతిగా.. సచిన్ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. "రిటైర్ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను. గురుశరణ్.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు. అలా నువ్వు రిటైర్ అయ్యి బెన్‌ఫిట్ మ్యాచ్ కోసం ప్లేయర్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతానని చెప్పాను. పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నాను. అతడి కోసం బెన్‌ఫిట్ మ్యాచ్ ఆడాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్