Share News

ICC Ranking Kohli No.2: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:35 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విజృంభించిన కింగ్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.2 స్థానంలోకి దూసుకెళ్లాడు. ఆ సిరీస్‌లో 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లీ తన ర్యాంక్‌ను రెండు స్థానాల మెరుగుపరుచుకున్నాడు.

ICC Ranking Kohli No.2: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ
Kohli ICC One-day Ranking No.2

ఇంటర్నెట్ డెస్క్: టాప్ ఫామ్‌లో ఉన్న కింగ్ కోహ్లీ మరో అద్భుతం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. రెండు ర్యాంకుల మేర తన స్థానాన్ని మెరుగుపరుచుకుని నెం.2గా నిలిచాడు. దీంతో, అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది (Kohli ICC One-day Ranking No.2).

వన్డేల్లో ప్రస్తుత టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ కంటే కేవలం 8 పాయింట్స్ ముందున్నాడు. ఇక కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే త్వరలో నెం.1 స్థానం పక్కా అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. నెట్టింట కోహ్లీకి జైకొడుతున్నారు.


కొద్ది నెలల క్రితం తన ఫామ్‌పై వ్యక్తమైన సందేహాలను పటాపంచలు చేస్తూ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా టోర్నీలో విజృంభించిన విషయం తెలిసిందే. రోహిత్‌తో కలిసి కోహ్లీ పరుగుల వరద పారించడంతో దక్షిణాఫ్రికాపై భారత్‌కు అద్భుత విజయం లభించింది. టెస్టుల్లో ఓటమితో నిరాశలో పడ్డ భారతీయ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లో కోహ్లీ ఏకంగా 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగులు, గువాహటిలో 102 పరుగులు, చివరగా వైజాగ్‌లో అర్ధ సెంచరీతో ప్రత్యర్థులపై సునామీలా విరుచుకుపడిన విషయం తెలిసిందే.

టాప్ - 5 లో ముగ్గురు మనోళ్లే

ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉన్న రోహిత్ ఈ సిరీస్‌లో 146 పరుగులు చేశాడు. కోహ్లీతో పోలిస్తే కాస్త దూకుడు తగ్గినా కూడా కొంతకాలంగా నిలకడ అయిన రన్ రేట్ సాధిస్తున్నందుకు రోహిత్ తన నెం.1 స్పాట్‌ను నిలబెట్టుకోగలిగాడు. ఇలా రో-కో టాప్ 2 స్థానాలను కైవసం చేసుకోవడంతో భారత క్రికెట్ అభిమానుల సంబరానికి అంతేలేకుండా పోయింది. పాత రోజులు తిరిగొచ్చాయంటూ తెగ మురిసిపోతున్నారు.

మెడకు గాయం కారణంగా మరో స్టార్ బ్యాటర్ శుభ్‌‌మన్ గిల్ దక్షిణాఫ్రికా సిరీస్‌ను మిస్సయిన విషయం తెలిసిందే. అయినా వన్డేల్లో నిలకడగా ఆడే శుభ్‌మన్ గిల్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. దీంతో, ప్రస్తుతం టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు భారతీయులే ఉండటంతో టీమిండియా డామినేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

తాజా ర్యాంకింగ్స్ ఇవీ

1. రోహిత్ శర్మ (భారత్) - 781 పాయింట్స్

2.విరాట్ కోహ్లీ (భారత్) - 773

3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 766

4. ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్గానిస్థాన్) - 764

5. శుభ్‌మన్ గిల్ (భారత్) - 723

6. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) - 722

7. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) - 708

8. షాయ్ హోప్ (వెస్టిండీస్) - 701

9. చరిత్ అసలంక (శ్రీలంక) - 690

10. శ్రేయస్ అయ్యర్ (భారత్) - 679


ఇవీ చదవండి:

నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్

సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Dec 10 , 2025 | 04:43 PM