Yuvraj Singh: యువీ.. ఓ పోరాట యోధుడు!
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:01 AM
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 44వ పుట్టిన రోజు నేడు. క్యాన్సర్ బారిన పడినా లెక్క చేయకుండా.. చికిత్స అనంతరం కూడా జట్టుకు ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పోరాట యోధుడి కథ ఇది!
ఇంటర్నెట్ డెస్క్: ఫార్మాట్ ఏదైనా చెలరేగి ఆడటం అతడి నైజం.. ఒకే ఓవర్‌లో సిక్సర్ల మోత మోగించడం అనేది ఇటీవల బాగా ట్రెండ్ అయింది కానీ దాదాపు 18 ఏళ్ల క్రితమే ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన ఘనత అతడిది.. క్యాన్సర్ వచ్చినా లెక్క చేయకుండా పోరాడి గెలిచిన అజేయ చక్రవర్తి అతడు.. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా! గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టీమిండియా బెస్ట్ ఆల్‌రౌండర్.. మిస్టర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh). నేడు యువీ 44వ పుట్టిన రోజు.
సిక్సర్ల కింగ్..
క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ‘ఆరు సిక్సులు’.. అని ప్రస్తావన రాగానే తొలుత గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆడిన ఆ నాక్.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఏ ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేకపోయారు. అప్పటి నుంచి క్రికెట్ అభిమానులు యువీకి ప్రేమగా పెట్టిన పేరు.. ‘సిక్సర్ల కింగ్’.
క్యాన్సర్ బారిన పడి..
మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన యువీ 11,778 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే 2011 వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం జట్టులోకి తిరిగొచ్చి మళ్లీ మునపటిలా అద్భుత ప్రదర్శనలు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. అయితే, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీకి టీమ్‌ఇండియా యాజమాన్యం అతడిని ఎంపికచేయకపోవడంతో నిరాశకు గురయ్యాడు. కొద్దిరోజులకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అరుదైన గౌరవం..
తాజాగా సౌతాఫ్రికా-టీమిండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా.. గురువారం రెండో టీ20 జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన న్యూ చండీగఢ్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు యువరాజ్ సింగ్ పేరు పెట్టారు. అతడు టీమిండియాకు అందించిన ఎనలేని సేవలకు ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏదైమైనా దేశం కోసం.. భారత క్రికెట్ జట్టు కోసం యువీ పడిన తపన గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు.. యూ ఆర్ జెమ్ ఫర్ టీమిండియా.. హ్యాపీ బర్త్‌డే ఛాంప్!
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ