SuryaKumar Yadav: పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:49 AM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శనలు చేస్తున్నాడు. గత 20 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20ల కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు చిత్తు అవ్వాల్సిందే. ఎలాంటి బంతి వేసిన పెద్ద షాట్లు ఆడటం సూర్యకి వెన్నతో పెట్టిన విద్య. కానీ.. గత కొంతకాలంగా స్కై బ్యాటింగ్‌లో మెరుపు తగ్గుతోంది. పేలవ ప్రదర్శన కొనసాగుతూ వస్తోంది. గత 20 టీ20 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు కేవలం 227 మాత్రమే. మరి సూర్య(SuryaKumar Yadav)కి ఏమైంది? ఈ పేలవ ప్రదర్శన వెనుక కారణాలేంటి?
లాంగ్ గ్యాప్..
ఈ 20 ఇన్నింగ్స్‌లో అతడు 12 సార్లు మూడో స్థానంలో, 8 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. వీటిల్లో పాకిస్తాన్ మీద చేసిన 47 పరుగులు, ఆస్ట్రేలియాపై సాధించిన 39 పరుగులు మినహా.. ఇంకా చెప్పుకో దగ్గ ప్రదర్శనలు అయితే లేవు. వీటిల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన కటక్ టీ20లో 12 పరుగులు, ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.
అందుకేనా?
సూర్య సాధారణంగా వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి దిగుతాడు. కానీ ఈ మధ్య కొన్నిసార్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో నాలుగో స్థానంలో కూడా బ్యాటింగ్‌కి రావాల్సి వస్తుంది. ఇది కూడా సూర్య ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని అభిమానులు విశ్లేషిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ సమీపిస్తోన్న నేపథ్యంలో సూర్య వరుస వైఫల్యాలు టీమిండియాను కలవరపెడుతోంది. స్కై వీలైనంత త్వరగా ఫామ్ అందుకుని జట్టుకు విలువైన నాక్‌లు ఆడి గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి:
ఓటమికి ఆ రెండూ కారణం.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్