Ind Vs SA: ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:10 AM
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవి చూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ జట్టు(Ind Vs SA) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(90) చెలరేగి ఆడాడు. ఫెరీరా(30), మిల్లర్(20) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ ఓ ఓవర్‌లో ఏడు వైడ్లు వేయడం, స్టార్ పేసర్ బుమ్రా భారీగా పరుగులు సమర్పించుకోవడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది.
ఛేదనకు దిగిన టీమిండియా(Team India) ఆది నుంచి తడబడింది. తిలక్ వర్మ(62) మినహా ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొటీస్.. ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది 13వ విజయం. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటి వరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.
భారత్‌పై జట్ల విజయాలివే..
దక్షిణాఫ్రికా-13
ఆస్ట్రేలియా-12
ఇంగ్లండ్-12
న్యూజిలాండ్-10
వెస్టిండీస్-10
ఇవీ చదవండి:
ఓటమికి ఆ రెండూ కారణం.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్