T20 WC 2026: వెరీ చీప్.. రూ.100కే ప్రపంచ కప్ టికెట్లు!
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:59 AM
ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. చాలా తక్కువ ధరకే టికెట్లు అమ్ముతుండటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలోనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫేజ్-1 టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత్‌లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచే మొదలవుతున్నాయి. శ్రీలంకలో LKR 1000(రూ.270) నుంచే ప్రారంభమయ్యాయి. తొలి విడతలో 20లక్షలకు పైగా టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. రెండో విడతకు సంబంధించిన వివరాలను ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది.
ఆ ఉద్దేశంతోనే..
ప్రపంచ కప్ టికెట్లను అంత తక్కువ రేట్లకే అమ్మడంపై ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా స్పందిచారు. ‘ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రతి క్రికెట్ అభిమానికి స్టేడియంలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అనుభవం పొందాలి. ఈ ప్రపంచ కప్‌ను ప్రతి అభిమానికి మరింత చేరువయ్యే ఐసీసీ ఈవెంట్‌గా మార్చడమే మా లక్ష్యం. అందుకే టికెట్లను రూ.100 నుంచి ఇవ్వడం ప్రారంభించాం’ అని తెలిపారు.
‘భారత్‌తో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించడం మాకు గర్వంగా ఉంది. అభిమానులు స్టేడియాలకు భారీగా తరలివస్తావని ఆశిస్తున్నాం. ఫేజ్-1 టికెట్లు ఓపెన్ అయ్యాయి. వెంటనే బుక్ చేసుకోండి’ అని శ్రీలంక క్రికెట్ సీఈవో అష్లీ డి సిల్వా చెప్పారు. భారత్, శ్రీలంకలోని ఎనిమిది స్టేడియాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇవీ చదవండి:
పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!