Sourav Ganguly Head Coach: సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్..ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సిద్ధం
ABN , Publish Date - Aug 24 , 2025 | 08:28 PM
సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే భారత క్రికెట్‌లో అగ్రెసివ్ లీడర్‌గా, స్ట్రాటజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దాదా, ఇప్పుడు కోచ్‌గా మారబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మన దాదా, సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భారత క్రికెట్‌ను ఒక ఊపు ఊపిన లెజెండ్. ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో క్రికెట్ పిచ్‌పైకి వస్తున్నాడు. కానీ ఈసారి బ్యాట్ కాదు, కోచింగ్ క్యాప్‌తో వచ్చేశాడు. ఆగస్టు 24న ఆదివారం SA20 లీగ్‌లోని ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు గంగూలీని తమ హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 2026 సీజన్‌కి సిద్ధమవుతున్న ఈ జట్టు, గంగూలీ రాకతో పుంజుకోనుంది.
గతంలో ఇంగ్లండ్ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఈ జట్టుకి కోచ్‌గా ఉన్నాడు. ఆగస్టు 23న శనివారం ట్రాట్ ఈ పదవి నుంచి తప్పుకోవడంతో, గంగూలీకి అవకాశం వచ్చింది. మా జట్టుకి సౌరవ్ గంగూలీ కొత్త హెడ్ కోచ్‌గా వస్తున్నారు. దాదా రాకతో క్యాపిటల్స్ క్యాంప్‌లో రాజసమైన ఉత్సాహం నెలకొనబోతోందని ప్రిటోరియా క్యాపిటల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
అసిస్టెంట్ కోచ్‌గా..
గంగూలీతో పాటు దక్షిణాఫ్రికా లెజెండ్ షాన్ పొలాక్‌ను కూడా అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు. క్యాపిటల్స్‌కి కొత్త శకం మొదలైంది. ఈ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి మా అసిస్టెంట్ కోచ్‌గా ప్రోటీన్ లెజెండ్ షాన్ పొలాక్ వస్తున్నారని జట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. గంగూలీ, పొలాక్ లాంటి లెజెండ్స్ ఒకే జట్టుతో కలిస్తే, ఆ టీమ్ ఎలా ఉంటుందో ఊహించండి మరి.
పాత సంబంధం
సౌరవ్ గంగూలీకి క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో ఇది కొత్త సంబంధం కాదు. 2018-19 మధ్యలో ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కి టీమ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత BCCI అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంతో ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. గత ఏడాది JSW స్పోర్ట్స్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడైన గంగూలీ, కోచింగ్ రోల్‌ని కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపాడు.
వివిధ పాత్రల్లో..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ నేను ఇప్పటివరకూ వివిధ పాత్రల్లో పనిచేశాను. క్రీడాకారుడిగా ఆడిన తర్వాత, CAB అధ్యక్షుడిగా, BCCI అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. కోచింగ్‌కి సమయం దొరకలేదు. కానీ ఇప్పుడు నాకు 50 ఏళ్లే. ఇప్పుడు ప్రిటోరియా క్యాపిటల్స్‌తో కోచింగ్ జర్నీ మొదలవుతోందన్నారు.
గంగూలీ ముందున్న సవాళ్లు
ప్రిటోరియా క్యాపిటల్స్ గత సీజన్‌లో పెద్దగా రాణించలేదు. 10 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి, ఆరు జట్లలో ఐదో స్థానంలో నిలిచింది. గంగూలీ ముందున్న మొదటి టాస్క్ SA20 ఆక్షన్‌లో సరైన ఆటగాళ్లను ఎంచుకోవడం. జట్టు పనితీరును మెరుగుపరచడం కోసం దాదా ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి