Ravi Shastri: ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం పద్ధతి కాదు: రవిశాస్త్రి
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:35 AM
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్‌లో మాత్రం క్లీన్‌స్వీప్ అయింది. ఈ ఓటమిపై రకరకాల విమర్శలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఓటమికి కారణమని హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలని.. అతడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిస విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి(Ravi Shastri) ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యతే అని గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం పద్ధతి కాదు. నా విషయంలోనూ ఇలాగే జరిగింది. అందుకే నేను ఆ అనుభవంతో మాట్లాడుతున్నా. అందుకే ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వైఫల్యాన్ని వారు కూడా అంగీకరించాలి. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయకూడదు. సౌతాఫ్రికా.. భారత్‌ను ఓడించింది.. అంతే కానీ ఏ ఒక్క సౌతాఫ్రికా ఆటగాడు భారత్‌ను ఓడించలేదు. దక్షిణాఫ్రికా జట్టు బాగా ఆడింది. మనం ఆడామా?’ అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.
భారత గడ్డపై సౌతాఫ్రికా దాదాపు 25 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ నెగ్గింది. 1999-2000 సంవత్సరంలో సౌతాఫ్రికా జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అప్పుడు కూడా టీమిండియా.. ప్రొటీస్ చేతిలో వైట్ వాష్ అయింది. అయితే గంభీర్(Gautam Gambhir) ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సొంతగడ్డపై టీమిండియా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది. ఆసీస్ టూర్‌లో సిరీస్ కోల్పోయింది. ఇంగ్లండ్ సిరీస్‌ను సమం చేసుకుంది. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం టీమిండియా మంచి ప్రదర్శనలే చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల రివార్డు
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!